Old Monk, Royal Challenge వేరియంట్లుపై నిషేధం, అసలు ఏం జరిగింది?!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
చలికాలపు రాత్రి… ఫ్రెండ్స్‌తో చిన్న పార్టీ… టేబుల్ మీద ఓ Old Monk బాటిల్. లేదా ఏదైనా ఫంక్షన్ తర్వాత “ఒక Royal Challenge తీసుకురా” అని చెప్పడం. మన దేశంలో ఇలాంటి దృశ్యాలు కొత్తవి కావు. దశాబ్దాలుగా ఈ బ్రాండ్లు కేవలం మద్యం పేర్లు కాదు… ఒక అలవాటు, ఒక నమ్మకం. దశాబ్దాలుగా కోట్లాది భారతీయుల గ్లాసుల్లో కనిపించిన ఈ బ్రాండ్లు ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ స్దాయిలో చర్చకు కేంద్రంగా మారాయి.
కారణం ఏమిటి?
ఇవన్నీ నకిలీ మద్యం మనా? ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు కలిపారనా? అవేమీ కాదు. “రమ్” అని అమ్ముతున్న పానీయం నిజంగా రమ్ తయారీ ప్రమాణాల ప్రకారమే తయారైందా? “విస్కీ” అని బాటిల్‌పై రాసి ఉంటే, ఆ రుచి సహజంగా వచ్చిందా? లేక చివర్లో ఫ్లేవర్ కలిపి సృష్టించారా?” అన్న ప్రశ్నే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే కారణంతో భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ FSSAI కొన్ని ప్రముఖ బ్రాండ్ల వేరియంట్ల అమ్మకాలపై నిషేధం విధించింది.
అసలు FSSAIకి ఏమి కనిపించింది?
FSSAI దర్యాప్తు ప్రకారం, కొన్ని తయారీ యూనిట్లు రమ్ లేదా విస్కీకి సహజంగా రావాల్సిన రుచిని సంప్రదాయ తయారీ విధానంలో పొందకుండా, Extra Neutral Alcohol (ENA) ను బేస్‌గా తీసుకుని, దానిలో బయట నుంచి “Rum Flavour” లేదా “Whisky Flavour” కలిపి మార్కెట్లో విక్రయించినట్లు ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించినట్లు తెలిపింది.
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ENA అంటే కల్తీ మద్యం కాదు. ఇది అత్యంత స్వచ్ఛమైన బేస్ ఆల్కహాల్. అనేక రకాల మద్యం తయారీలో దీనిని ఉపయోగిస్తారు. కానీ ఒక రమ్‌కు ప్రత్యేకమైన రుచి, వాసన సంప్రదాయంగా ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్, ఓక్ బ్యారెల్స్‌లో పరిపక్వత ద్వారా రావాలి. అదే రుచిని చివర్లో “Rum Flavour” కలిపి తీసుకొస్తే, అది రమ్ తయారీ ప్రమాణాలకు విరుద్ధమని FSSAI అభిప్రాయపడుతోంది.
అంటే సమస్య మద్యం నాణ్యత కంటే ఉత్పత్తి స్వరూపం గురించే. వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నది నిజంగా ఆ పేరుకు తగిన విధంగా తయారైందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న.సమస్య.
ఒక రమ్ బాటిల్ అసలు ఎలా తయారవుతుంది?
సాధారణంగా చెరకు నుంచి వచ్చే మొలాసిస్ లేదా ధాన్యాల నుంచి ఆల్కహాల్ తయారవుతుంది. తర్వాత ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్ జరుగుతాయి. ఆ తర్వాత నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు చెక్క బ్యారెల్స్‌లో పరిపక్వత పొందుతుంది. అదే సమయంలో సహజంగా రుచి, వాసన, రంగు ఏర్పడతాయి.
ఇప్పుడు వివాదం కూడా ఇక్కడే. సంవత్సరాల పాటు సహజంగా రావాల్సిన రుచిని చివర్లో ఫ్లేవర్‌తో తీసుకొస్తే… అది అదే రమ్‌గా పరిగణించాలా? ఇదే ప్రశ్నను FSSAI లేవనెత్తుతోంది.
“7 Years Old”… కానీ నిజంగానే ఏడేళ్లదేనా?
ఈ కేసులో ఎక్కువ చర్చకు కారణమైన అంశాల్లో ఒకటి Old Monk XXX Rum “7 Years Old Blended” అనే లేబుల్. సాధారణంగా బాటిల్‌పై “7 Years” అని కనిపిస్తే, చాలామంది అందులోని మొత్తం మద్యం కనీసం ఏడేళ్లు పరిపక్వత పొందిందని అనుకుంటారు. కానీ FSSAI నిబంధనల ప్రకారం బ్లెండెడ్ స్పిరిట్‌లో వయస్సు చెప్పాలంటే, అందులో కలిసిన స్పిరిట్లలో అతి చిన్న వయస్సు ఉన్నదానినే అధికారికంగా పరిగణించాలి.
ఈ ప్రమాణానికి అనుగుణంగా ఆ లేబుల్ లేదని FSSAI పేర్కొంది. అంటే బాటిల్‌పై ఉన్న సమాచారం వినియోగదారుడిని తప్పుదారి పట్టిస్తోందని ఆరోపణ.
ఏయే బ్రాండ్లు ప్రభావితమయ్యాయి?
ఈ చర్య ఒక్క Old Monk వరకే పరిమితం కాలేదు. మధ్యప్రదేశ్‌లో తయారైన Royal Challenge Whisky, Antiquity Blue Whisky, Bagpiper Deluxe Whisky, Old Cask Deluxe XXX Rum, మహారాష్ట్రలోని ఖోపోలీ యూనిట్లో తయారైన Old Monkకు చెందిన మూడు వేరియంట్లు, అలాగే McDowell’s No.1 Rumలోని ఒక ఉత్పత్తిపై కూడా నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అయితే ఇక్కడ మరో కీలక విషయం ఉంది. మొత్తం బ్రాండ్‌ను నిషేధించలేదు. అన్ని Old Monk బాటిళ్లను కూడా నిషేధించలేదు. ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించిన కొన్ని తయారీ యూనిట్లలో తయారైన నిర్దిష్ట వేరియంట్లపై మాత్రమే ఈ చర్యలు తీసుకున్నారు. ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇది ఆరోగ్య సమస్యా?
సోషల్ మీడియాలో వార్తలు చూసిన తర్వాత చాలామంది “ఇవి తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా?” అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం FSSAI ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉన్నాయని చెప్పలేదు. ఈ చర్యకు కారణం లేబెలింగ్, తయారీ విధానం, ఉత్పత్తి ప్రమాణాలు. అంటే ఇది Consumer Deception అంశం. వినియోగదారుడు డబ్బు పెట్టి కొంటున్న వస్తువు, బాటిల్‌పై చెప్పిన విధంగానే తయారైందా లేదా అన్నదే వివాదం.
అయితే కంపెనీలు ఏమంటున్నాయి?
పరిశ్రమ మాత్రం FSSAI నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించడం లేదు. కొన్ని కంపెనీలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. మద్యం పరిశ్రమ సంఘాలు కూడా ఈ సంస్థతో చర్చలు జరుపుతున్నాయి. అప్పీల్ చేసిన తర్వాత రెండు కంపెనీలకు కొన్ని షరతులతో ఇప్పటికే తయారైన స్టాక్‌ను అమ్ముకునేందుకు తాత్కాలిక ఉపశమనం కూడా లభించింది.
అంటే ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టేం కాదు. రాబోయే రోజుల్లో కోర్టుల తీర్పులు, నియంత్రణ సంస్థ తదుపరి నిర్ణయాలు ఈ అంశాన్ని మరోసారి వార్తల్లోకి తీసుకురావచ్చు.
ఇక వైన్ షాప్‌కి వెళ్తే ఏమి గమనించాలి?
ఈ వివాదం తర్వాత వినియోగదారులు కొన్ని విషయాలపై దృష్టి పెట్టడం మంచిది.
బాటిల్‌పై ఉన్న వయస్సు (Age Statement)
తయారీ యూనిట్ వివరాలు
లేబుల్‌లో ఉన్న ప్రకటనలు
బ్యాచ్ వివరాలు
అధికారిక సీల్, ఎక్సైజ్ మార్కింగ్
ఇవి చదవడం చాలామందికి అలవాటు ఉండదు. కానీ ఈ సంఘటన తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంది.
ఏదైమైనా
Old Monk, Royal Challenge, Bagpiper వంటి పేర్లు భారత మార్కెట్లో కేవలం బ్రాండ్లు కాదు… ఒక తరం జ్ఞాపకాలలో భాగం. అందుకే FSSAI చర్య అంత పెద్ద చర్చకు దారితీసింది.
ఈ కేసు చివరకు కోర్టులో ఏ మలుపు తిరిగినా, ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఇకపై వినియోగదారులు బాటిల్‌పై ఉన్న పేరును మాత్రమే కాదు… ఆ పేరు వెనుక ఉన్న నిజాన్ని కూడా ప్రశ్నించే కాలం ప్రారంభమైంది. అదే ఈ కథలోని అసలు ట్విస్ట్.








