‘క్రిమినల్ వేస్ట్’ కామెంట్స్.. తెలంగాణలో పొలిటికల్ హీట్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్య లోపాలు, విద్యావ్యవస్థలోని లోపాలపై మాట్లాడే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన “క్రిమినల్ వేస్ట్” అనే పదం తీవ్ర దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారని, అయితే వారిలో కనీసం ఉద్యోగం కోసం తెల్ల కాగితంపై దరఖాస్తు రాసే నైపుణ్యాలు కూడా ఉండటం లేదని, అలాంటి విద్యావిధానం అంతా క్రిమినల్ వేస్ట్ అని సీఎం పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం సీఎం చేసినప్పటికీ, ఈ పద ప్రయోగం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు బలమైన రాజకీయాస్త్రంగా మారింది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్, బీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు 89 కేసులున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే అతి పెద్ద క్రిమినల్ వేస్ట్ అని ఎద్దేవా చేశారు. జీవితంలో ఎప్పుడైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసారా, ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరయ్యారా అని ప్రశ్నిస్తూ… ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను అవమానించడమే కాంగ్రెస్ విధానమా అని నిలదీశారు. అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 4 పేజీల బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని విద్యావంతులను రేవంత్ రెడ్డి తీవ్రంగా అవమానించారని, రాహుల్ గాంధీ దీనికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే అల్లేటి మహేశ్వర్ రెడ్డి సైతం సీఎం వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమే ఒక క్రిమినల్ వేస్ట్ అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ యువతను నిరంతరం అవమానిస్తున్నారని, ఇంజనీర్లు దేశ అభివృద్ధికి వెన్నెముక వంటివారని స్పష్టం చేశారు.
మరోవైపు, తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాలు సీఎం వ్యాఖ్యలపై నిరసన వ్యక్తంచేస్తున్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే రాష్ట్ర పరిశ్రమలకు, సాంకేతిక పురోగతికి పట్టుగొమ్మలని, అలాంటి వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం లెక్చరర్లను, విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా గాయపరచడమేనని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. సీఎం తక్షణమే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ విమర్శలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యమంత్రి విద్యార్థులను వ్యక్తిగతంగా అనలేదని, గత పదేళ్లలో నాణ్యత లేని విద్యావ్యవస్థ వల్ల విద్యార్థులు నైపుణ్యాలు కోల్పోయారని, ఆ విద్యా విధానంలోని వైఫల్యాన్నే ఎత్తి చూపారని స్పష్టం చేశారు. మాటల్లోని అంతరార్థాన్ని వదిలేసి, ఒక పదాన్ని పట్టుకుని బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేయడం వారి అవకాశవాదానికి నిదర్శనం అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ వారసత్వంతో వచ్చిన కేటీఆర్ లాంటి వారికి క్షేత్రస్థాయి స్కిల్ గ్యాప్ సమస్యలు అర్థం కావు అని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది.
నిరుద్యోగులు, విద్యార్థి ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు ప్రతిపక్షాలకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒక అస్త్రంగా దొరికాయి. స్కిల్ డెవలప్మెంట్, జర్మనీ-జపాన్ వంటి దేశాల తరహా నైపుణ్య శిక్షణ ప్రాధాన్యత గురించి మాట్లాడే ఉద్దేశంతో సీఎం చేసిన వ్యాఖ్యలు… ఆయన వాడిన తీవ్ర పదజాలం వల్ల రాజకీయ రచ్చగా మారాయి.








