శతాబ్ది కామన్వెల్త్ క్రీడలకు భారత్ సిద్ధం.. ఆతిథ్య బాధ్యతలు అప్పగింత..!
మరో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికవుతోంది. స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో తదుపరి క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని భారత ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష అందుకున్నారు. 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ క్రీడలు.. కామన్వెల్త్ చరిత్రలో శతాబ్ది క్రీడలు కావడం విశేషం.
గ్లాస్గోలోని ఓవో హైడ్రో ఎరీనాలో జరిగిన ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకారే సమక్షంలో పతాక మార్పిడి జరిగింది. ముందుగా కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని అవనతం చేసిన తర్వాత గ్లాస్గో లార్డ్ ప్రొవోస్ట్ జాక్వెలిన్ మెక్లారెన్ దానిని భారత ప్రతినిధులైన నీరజ్ చోప్రా, పీటీ ఉషలకు అందజేశారు. దీంతో స్కాట్లాండ్ నుంచి భారత్‌కు అధికారికంగా ఆతిథ్య బాధ్యతలు బదిలీ అయ్యాయి.
ఈ ఘట్టం తర్వాత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ అద్భుతమైన ప్రదర్శన సాగింది. ‘వసుధైక కుటుంబం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే ప్రాచీన భారతీయ తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంగీతం, నృత్యం, కథల రూపంలో సాగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III తరఫున హాజరైన ప్రిన్స్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ అథ్లెట్లను అభినందించారు. “నాలుగేళ్ల తర్వాత జరగనున్న 24వ కామన్వెల్త్ క్రీడల కోసం, అలాగే శతాబ్ది ఉత్సవాల కోసం మీరందరూ అహ్మదాబాద్‌కు రావాలని నేను ఆహ్వానిస్తున్నాను” అని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఈ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా మహిళల 57 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన జాస్మిన్ లాంబోరియా వ్యవహరించారు.








