రాజకీయ ప్రసంగాలు…మహిళా సదస్సులు…బిజినెస్ సమావేశాల నడుమ ఘనంగా జరిగిన ఆటా రెండో రోజు కార్యక్రమాలు
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19వ మహాసభల రెండో రోజు వేడుకలు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. రెండో రోజు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమెరికాలో తెలుగు వారి స్ఫూర్తిని కొనియాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యనాయకులు బాంక్వెట్ హాల్ మీటింగు కు హాజరై ప్రసంగించారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, పూజా హెగ్డే , రీతూ వర్మ రెండో రోజు సమావేశాల్లో పాల్గొన్నారు.
వివిధ కార్యక్రమాలు
రెండో రోజు ఆటా మహాసభల సందర్భంగా అనేక ప్రోగ్రాములు జరిగాయి. ఉదయం 130 మంది కళాకారులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనిల్ బోయినపల్లి ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ ఫోరమ్ లో మేరీల్యాండ్ గవర్నర్ అరుణ మిల్లర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య వేదిక, ఉమెన్ ఫోరమ్ సమావేశాలలోనే వందలాది మంది పాల్గొన్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ నేతృత్వంలో జరిగిన ఫ్యాషన్ షో కళ్ళు జిగేల్ మన్నాయి. తెలంగాణ చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన వస్త్రాలతో వందల మంది యువతీ యువకులు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.
పరంపర పేరుతో చేసిన శివ పార్వతుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఆటా మహాసభల వేడుకలకు స్పాన్సర్ చేసిన వారి కుటుంబాలను కూడా అభినందించారు.
నాయకుల ప్రసంగాలు…
తెలంగాణ పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలని ఎనఆరఐలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలువు ఇచ్చారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్ లో ఎనఆరఐ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్లో రూ.10 కోట్లతో ఎన్నారై భవన్కు కృషి చేస్తామని ప్రకటించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు త్వరలోనే ‘ప్రభాత భేరికి శ్రీకారం చుడతామన్నరు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో ఆటా సేవలు అభినందనీయం అన్నారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్ లో ఎనఆరఐ భాగస్వాములు కావాలని, అమెరికాలోని మీ మిత్రులు, విదేశీ సహోద్యోగులకు తెలంగాణ పర్యాటక వైభవాన్ని పరిచయం చేసి, సెలవుల్లో వారిని తెలంగాణకు తీసుకువచ్చి రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగస్వాముల అయ్యేలా చూడాలని జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
అమెరికా నుంచి తెలంగాణకు వచ్చే ప్రవాస భారతీయులకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా హైదరాబాద్లో రూ.10 కోట్ల వ్యయంతో ఎన్నారై భవన్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భవన్ ప్రవాస భారతీయులకు సమన్వయ కేంద్రంగా ఉప యోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ATA బృందాలు లేదా ఎనఆరఐ గ్రూపులు దత్తత తీసుకుని, వాటి అభివృద్ధి, పరిరక్షణ, పునరుద్ధరణకు చేయూత అందించాలని కోరారు.
అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకంగా ఉందని బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రామచంద్ర రావు అన్నారు. అమెరికా వచ్చినా భారతీయ సంసృతి ని కాపాడు కోవడం అభినందనీయం అన్నారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు ఉండేలా ప్రధాని మోడీ కృషి చేశారని అన్నారు. తమ సంసృతి కాపాడుకుంటూనే తెలుగుదనాన్ని నిలబెట్టడం లో ఆటా పాత్ర కీలకం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడారి కిషోర్, పుట్ట మధు, బీఆరఎస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లు, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, బీఆరఎస్ ఎనఆరఐ యూఎసఏ ఇన్చార్జ్ మహేష్ తన్నీరు తదితరులు పాల్గొన్నారు.








