ఘనంగా ప్రారంభమైన 19వ ఆటా మహాసభలు.. వివాహ వేడుకలా సాగుతుందన్న మనోహర్ ఎనుగు
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు , యూత్ కన్వెన్షన్ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను బాంక్వెట్ కమిటీ చైర్ మనోహర్ ఎనుగు తన ప్రసంగంలో వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ప్రారంభ వేడుకలు, బ్యాంక్వెట్, సాంస్కృతిక కార్యక్రమాలు , ఆటా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగాయి. తమ మిత్రులకు అవార్డులు రావడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు రోజుల వేడుకలు ఒక పెళ్లి వేడుకలా సాగుతున్నాయని, మొదటి రోజు సంగీత్ లాగా, మరుసటి రోజు వివాహంలాగా, ఎల్లుండి రిసెప్షన్ లాగా ఉంటుందని ఆయన సరదాగా అభివర్ణించారు.
మొదటి రోజు ప్రారంభ కార్యక్రమాలు , విందు వినోదాల అనంతరం, రెండవ రోజు నుండి ప్రధాన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా యూత్ ఫోరమ్స్, బిజినెస్ ఫోరమ్స్, పొలిటికల్ ఫోరమ్స్ తో పాటు పలు సామాజిక నెట్ వర్కింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. శ్రీధర్ , ఇతర టీమ్ సభ్యులు వేదిక ఏర్పాటుతో పాటు అన్ని కార్యక్రమాలను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఈ వేడుకలను ఆస్వాదించాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.








