చరిత్ర సృష్టించనున్న సిలికానాంధ్ర!
ఒక గిన్నిస్ రికార్డు సృష్టించడానికే ఎంతో హైరానా పడే రోజుల్లో… ఒకటి కాదు, ఏకంగా మూడు రికార్డులు సొంతం చేసుకోబోతోంది సిలికానాంధ్ర సంస్థ! ప్రపంచ రికార్డుల మోత… సిలికానాంధ్ర ఘనత అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మొదటి అంతర్జాతీయ కూచిపూడి ఉత్సవాలు కాలిఫోర్నియా లోని కుపర్టినో నగరంలో నిర్వహించినప్పుడు మొదలైన గిన్నిస్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే వుంది సిలికానాంధ్ర!
ఇప్పుడు మొదటి ఫోటో చూడండి… అది ఓక్లాండ్ నగరంలో వున్న ఎరీనా ఇండోర్ స్టేడియం. 15500 సీటింగ్ సామర్ధ్యం కలిగిన ఇండోర్ స్టేడియం. ఇదే ఇప్పుడు సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ వేడుకలకు వేదిక. మొత్తం మూడు గిన్నిస్ రికార్డులు ఈ ఒక్క వేడుకలోనే సిలికానాంధ్ర సొంతం కాబోతున్నాయి.
సంగీతామృతవర్షిణి, లయామృతవర్షిణి, శతక శంఖారావం, వందే భారతం, దక్ష యజ్ఞం నాటకం, జానపద జాతర … ఇలా ఒకేరోజు ఆగస్టు 1న ఉదయం నుంచి రాత్రి వరకు సాహిత్య సంగీత నృత్య నాటక జానపద కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. అమెరికా తెలుగు వారి చరిత్రలో ఒకే రోజు నాలుగు వేల మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చే అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఇది 250 సంవత్సరాల అమెరికా చరిత్రలో 122 ఏళ్ల ఇక్కడి తెలుగు వారి చరిత్రలో మున్నెన్నడూ జరగని అపురూప వేడుక! ఇలా సిలికానాంధ్ర మరో అపురూప అద్భుత చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు ఇంకొన్ని గంటల సమయమే మిగిలి వుంది! ప్రపంచంలోని తెలుగు వారంతా గర్వించే అపురూప సన్నివేశం తిలకించేందుకు సిద్ధంగా వుండండి.
నిన్నటి నుంచి ఓక్లాండ్ ఎరీనా స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు అక్కడ కళాకారుల రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ అపూర్వ వేడుకను దిగ్విజయం చేసేందుకు డాక్టర్ ఆనంద్ కూచిభోట్ల నాయకత్వంలో 300 మందికి పైగా వలంటీర్లు విశేషంగా కృషి చేస్తున్నారు. వివిధ కమిటీలు ఏర్పాటు చేయగా, ఎవరి బాధ్యతలను వారు సొంతపనిలా భావించి చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఇది తెలుగు వారి ఘనమైన ఐక్యతకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇండియా, కెనడా నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
– డా. మహ్మద్ రఫీ
(ఓక్లాండ్, అమెరికా నుంచి)








