సిలికానాంధ్ర వెండి పండుగ
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ నేతలు, సినీ తారలు లేకుండా అచ్చమైన అత్యంత భారీ తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాల పండుగ జరుగుతోంది! సిలికానాంధ్ర సంస్థ ఏం చేసినా సంచలనమే! మెదటినుంచి తెలుగు భాషా దీప్తి, సంస్కృతి సంప్రదాయాల స్ఫూర్తి అంటూ విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర వెండి పండుగకు సిద్ధమైంది. జూలై 31 నుంచి 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు రజతోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది.
ప్రపంచ రికార్డులతో ప్రత్యేక గుర్తింపు పొందిన సిలికానాంధ్ర ఈసారి సిల్వర్ జూబ్లీ వేడుకలో మరో మూడు రికార్డులతో తెలుగు వారి ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పబోతోంది. ఇందుకు కాలిఫోర్నియా లోని ఓక్లాండ్ స్టేడియం ముస్తాబవుతోంది. దాదాపు 15 వేల మందికి పైగా ప్రవాస తెలుగు వారు ఈ వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మిల్ పిటాస్ లోని సిలికానాంధ్ర వారి అరియ యూనివర్సిటీతో పాటు మరో ఐదు చోట్ల వందల మంది కళాకారులు ముమ్మరంగా రిహార్సల్స్ చేస్తున్నారు. బుధవారం ప్రముఖ రచయిత కవి జొన్నవిత్తుల గారు, సింగపూర్ తెలుగు సమాజం వామరాజు సత్యమూర్తి గారు, నేను అరియ విశ్వ విద్యాలయం సందర్శించి, అక్కడే వివిధ కార్యక్రమాలతో బిజీగా వున్న సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపకులు కూచిభోట్ల ఆనంద్ గారిని కలసి అభినందించాం.
అక్కడే చిన్నారులకు దక్ష యజ్ఞం పద్య నాటకం నేర్పిస్తూ దిలీప్ కొండిపర్తి గారు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గాన గంధర్వ గుమ్మడి గోపాలకృష్ణ గారు కనిపించారు. వారిని పలకరించాం. జానపద జాతరకు సిద్ధం చేస్తున్న “జానపద సంచలనం” లింగా శ్రీనివాస్ గారు, స్నేహ వేదుల గారు కనిపించారు. కూచిపూడి రంగపూజ నృత్యాంశం నేర్పిస్తూ వేదాంతం రాఘవ గారు, కూచిపూడి నృత్యామృతవర్షిణి లీడ్ చేస్తూ జ్యోతి చింతలపూడి గారు మరోవైపు వున్నారు. సంగీత మధురిమల గురించి వివరిస్తూ ప్రముఖ లలిత సంగీత దర్శకుడు కె. రామాచారి గారు కనిపించారు. ఇంకా సిలికానాంధ్ర రాజు చమర్తి గారు, రఘు మల్లాది గారు, శాంతి ఆనంద్ గారు, ప్రస్తుత అధ్యక్షురాలు ప్రియ తనుగుల గారు, మానస గారు, శ్రీదేవి గారు, మిమిక్రి జనార్దన్ గారు, వ్యాఖ్యాతగా విచ్చేసిన అంబడిపూడి మురళీకృష్ణ గారు ఇంకా చాలామంది వారికి కేటాయించిన పనుల్లో బిజీగా వున్నారు.
– డా. మహ్మద్ రఫీ
(మిల్ పిటాస్, కాలిఫోర్నియా, అమెరికా నుంచి)








