అమెరికాలో ఉద్యోగం చేయాలంటే కోటి కట్టాలా? ట్రంప్ మరో ట్విస్ట్
— సూర్య ప్రకాష్ జోశ్యుల
సాధారణంగా అమెరికా వెళ్లాలంటే ఎంత అవుతుంది?
రూ.40 లక్షలు, 50 లక్షలు… మహా అయితే ఓ 60 లక్షలు. ఈ లెక్కలన్నీ అందరికీ తెలుసు. దానికి తగ్గట్టే బ్యాంక్ లోన్లు, ఇళ్ల తాకట్టులు, బంధువుల దగ్గర చేబదుళ్లు… ఇలా ఏదో రకంగా సర్దుబాటు చేసుకుంటారు.
కానీ…”అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయడానికి ఎంత ఖర్చు?”
ఇప్పటివరకు అలా ఎవరూ అడగలేదు, ఊహించలేదు కూడా. ఎందుకంటే ఉద్యోగం సంపాదిస్తే డబ్బులొస్తాయి కానీ, ఉద్యోగం చేయడానికే మళ్లీ లక్షల కొద్దీ డబ్బులు కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోరు. అయితే, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్న ఒక ఆలోచన నిజమైతే మాత్రం… అమెరికాలో చదువు ముగిసి ఉద్యోగంలో చేరాలంటే ఏకంగా 1 లక్ష డాలర్లు (దాదాపు రూ.1 కోటి) చెల్లించాల్సి రావచ్చు!
అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులకు ఇచ్చే OPT (Optional Practical Training) అవకాశానికే ఈ భారీ ధరకు రెక్కలు తొడగాలని చూస్తున్నారు.
లక్షల కుటుంబాలు వేసుకున్న ఒక్క ‘లెక్క’ తప్పబోతోందా?
మన దేశంలో… ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్కా ప్లాన్‌తో పిల్లలను అమెరికా పంపుతారు. ముందు ఎడ్యుకేషన్ లోన్. తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ చదువు. చదువు పూర్తయ్యాక OPTపై ఉద్యోగం. ఆ ఉద్యోగంతో అప్పులు తీర్చడం. ఆ తర్వాత H-1B వీసా ద్వారా అమెరికాలో కెరీర్ నిర్మించుకోవడం. ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత కీలకమైన దశ… OPT. దీనికోసం ఇప్పుడు దాదాపు కోటి రూపాయల ఫీజు ప్రతిపాదన రావడం వల్ల అమెరికా ప్లాన్ మొత్తం మారిపోవచ్చనే చర్చ మొదలైంది.
కోర్సు పూర్తయ్యాక సాధారణ విద్యార్థులకు ఏడాది పాటు, సైన్స్-టెక్నాలజీ (STEM) కోర్సులు చేసిన వారికి మూడేళ్ల పాటు అక్కడ పనిచేసుకునే వెసులుబాటే ఈ OPT. ఈ మూడేళ్లలో సంపాదించే ప్రతి డాలర్ ద్వారానే ఇక్కడ చేసిన అప్పులన్నీ తీరిపోతాయి.
ఇప్పుడు సరిగ్గా ఆ OPT మీదే రూ.1 కోటి భారం మోపాలని చూడటం అంటే… మొత్తం ఆ ‘అమెరికా డ్రీమ్’ పునాదులనే కదిలించడమే.
అసలు ట్విస్ట్ ఫీజులో లేదు!
ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న ఉంది. ఈ రూ.కోటి రూపాయలను విద్యార్థి కట్టాలా? లేక ఉద్యోగం ఇచ్చే కంపెనీ కట్టాలా? దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఒకవేళ విద్యార్థే కట్టాలంటే: చదువుకే ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టిన కుటుంబాలు… ఉద్యోగం కోసం మళ్లీ ఇంకో కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాయి?
ఒకవేళ కంపెనీయే కట్టాల్సి వస్తే: ఏ కంపెనీ అయినా ఒక విదేశీ విద్యార్థి కోసం రూ.కోటిదనంగా ఖర్చు పెట్టి ఉద్యోగంలోకి తీసుకుంటుందా? “అంత డబ్బు దండగ… అదేదో స్థానిక అమెరికన్ అభ్యర్థినే తీసుకుంటే సరిపోతుందిగా!” అని ఆలోచించదా?
అంటే, ఫీజు సాకుతో విదేశీయులకు ఉద్యోగాలు దక్కకుండా చేయడమే దీని వెనుక ఉన్న అసలు ఎత్తు. గమ్మత్తు.
ఇది ఒక్క నిర్ణయం కాదు… మారుతున్న గాలికి సంకేతం
కేవలం OPT మాత్రమే కాదు… ట్రంప్ ప్రభుత్వం ఒకేసారి అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండే గడువును గరిష్టంగా 4 ఏళ్లకు పరిమితం చేసే మరో కొత్త నిబంధన కూడా తెరపైకి వచ్చింది.
స్టూడెంట్ వీసా దగ్గర మొదలుపెడితే, చదువు తర్వాతి OPT, ఆపై ఇచ్చే H-1B వీసా వరకు… ప్రతి దశలోనూ నిబంధనలు బిగుసుకుంటున్నాయి.
ఇప్పుడే ప్యాక్ చేసేసుకోవాలా? భయపడాలా?
ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. లక్షలాది మంది OPT మీద ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే ఈ వార్త వినగానే అందరిలోనూ ఒకటే ఆందోళన.
అయితే, ఇప్పుడే భయపడిపోవాల్సిన పనిలేదు!
ఇది ఇంకా ప్రతిపాదన మాత్రమే. అధికారికంగా అమల్లోకి రాలేదు. అమెరికా చట్టసభల (కాంగ్రెస్) ఆమోదం పొందడం, అక్కడి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడం అంత సులభం కాదు. విదేశీ విద్యార్థుల ద్వారా అమెరికా యూనివర్సిటీలకు బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుంది, కాబట్టి యూనివర్సిటీలు కూడా దీనిపై ఊరుకోవు. అడ్డుకోవటానికే ప్రయత్నిస్తాయి.
చివరగా…
ఒక్కటి మాత్రం నిజం. అమెరికా వెళ్లడం, అక్కడ చదవడం కంటే… చదువు అయ్యాక అక్కడ నిలదొక్కుకోవడం అనేది రానున్న రోజుల్లో మరింత కత్తిమీద సాములా మారబోతోంది.
ఇన్నాళ్లూ ఉన్న “MS చేస్తే లైఫ్ సెటిల్” అనే నమ్మకం నుంచి, “అసలు మనం అమెరికా వెళ్లాలా? లేదా ఇక్కడే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలా?” అనే ఆలోచనలోకి విద్యార్థులు, తల్లిదండ్రులు మారక తప్పని పరిస్థితి వస్తోంది.








