పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.! నర్సంపేటలో విషాదం.!
ఉద్యమ నేతగా ప్రస్థానం ప్రారంభించి, ప్రజలతో మమేకమై పనిచేసిన తెలంగాణ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) అకాల మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉద్యమ కాలం నుంచి నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమించిన ఒక సీనియర్ నేతను కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటుగా మారింది.
ఈ నెల 26న హనుమకొండలో ఉన్న సమయంలో సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయనకు ‘కార్డియాక్ అరెస్ట్’ సంభవించినట్లు గుర్తించిన వైద్యులు, దాదాపు గంటపాటు శ్రమించి పలుమార్లు సీపీఆర్ (CPR) నిర్వహించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం మెరుగైన వైద్య సదుపాయాల కోసం అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించింది. అయితే కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారని వైద్యులు ధృవీకరించారు.
1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, చిన్ననాటి నుంచే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థి దశలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన NSUI ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన సమయంలో ఆ పార్టీలో చేరి, స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ భావజాలాssన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడంలో ముందుండేవారు. ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ముద్ర వేసుకున్నారు.
ఉద్యమంలో చూపిన చొరవ, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి 2015లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఆ పదవిలో ఉన్న కాలంలో అనేక సంస్కరణలు చేపట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అహర్నిశలు శ్రమించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నర్సంపేట నుంచే పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గ ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో అనుబంధాన్ని వీడలేదు.
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై జీవించిన ఒక ప్రజా ప్రతినిధిని, ఉద్యమ సమరయోధుడిని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నల్లబెల్లిలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుదర్శన్ రెడ్డి నిష్క్రమణ తెలంగాణ రాజకీయాల్లో ఒక నిబద్ధత కలిగిన నాయకుడి లోటును స్పష్టంగా చూపిస్తోంది.








