సాయి పల్లవిపై ట్రోలింగ్ ? అసలు తప్పు ఎవరిది?
“ఒక ట్రైలర్… ఒక పాత్ర… నాలుగు నిమిషాలు. ఒక నటిని జడ్జ్ చేయడానికి నిజంగా ఇది సరిపోతుందా?”
సినిమా ఇంకా విడుదల కాలేదు.
సాయి పల్లవి పూర్తి పాత్రను ఎవరూ చూడలేదు. ఆమె నటన ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు. అయినా సోషల్ మీడియాలో తీర్పు వచ్చేసింది. “మిస్‌కాస్ట్”, “సీతలా కనిపించడం లేదు”, “ఇంకెవరినైనా తీసుకుని ఉండాల్సింది”… ఇలాంటి పోస్ట్ ల వర్షం సోషల్ మీడియాలో కురుస్తూనే ఉంది. ‘రామాయణ’ ట్రైలర్ తర్వాత మొదలైన ఈ చర్చ కేవలం ఒక హీరోయిన్‌పై వచ్చిన ట్రోలింగ్ కాదు. మనం సినిమాలను చూసే విధానం ఎంత వేగంగా మారిపోయిందో చెప్పే మరో ఉదాహరణ.
ట్రైలర్ కాదు… తీర్పే మొదటి రిలీజ్
ఒకప్పుడు ట్రైలర్ అంటే సినిమాపై ఆసక్తి పెంచే సాధనం. ఇప్పుడు ట్రైలర్ అంటే సోషల్ మీడియా కోర్టులో మొదటి విచారణ.నాలుగు నిమిషాల వీడియో ఆధారంగా నటుడి కెరీర్, దర్శకుడి విజన్, సినిమా ఫలితం… అన్నింటిపైనా తీర్పు చెప్పేస్తున్నారు.
మీడియా సిద్ధాంతకర్త మార్షల్ మెక్లూహన్ చెప్పిన ఒక మాట ఇక్కడ గుర్తుకు వస్తుంది.
“The medium is the message.”
అంటే, మనం సమాచారాన్ని ఎక్కడ చూస్తున్నామో ఆ వేదికే మన ఆలోచనను కూడా మార్చేస్తుంది. సోషల్ మీడియా లో అదే జరుగుతోంది. ఇప్పుడు అక్కడ వేగమే విలువ. ఆలోచన కంటే స్పందనకు ఎక్కువ ప్రాధాన్యం.
ఎందుకు ఇంత త్వరగా జడ్జిమెంట్?
దీనికి ఒక కారణం మన మనస్తత్వం. మరో కారణం ఆల్గోరిథమ్. సోషల్ మీడియాలో ముందుగా స్పందించినవారికే ఎక్కువ రీచ్ వస్తుంది. అందుకే ఇప్పుడు “సినిమా చూద్దాం” అనే ఆలోచన కంటే, “ముందు నా అభిప్రాయం పోస్ట్ చేయాలి” అనే తొందరే ఎక్కువైంది.
అలాగే సాయి పల్లవిని సీతగా ప్రకటించిన రోజే “సరిపోదు” అనుకున్నవారికి, ట్రైలర్లో అదే కనిపించింది. మరోవైపు ఆమె అభిమానులకు అదే ట్రైలర్లో సీత కనిపించింది. అంటే, చాలాసార్లు ట్రైలర్‌ను చూడడం కాదు… మన అభిప్రాయాన్నే అందులో వెతుకుతాం.సైకాలజీలో దీనిని Confirmation Bias అంటారు. అంటే, మనం ముందే నమ్మిన అభిప్రాయాన్ని బలపరిచే ఆధారాలనే ఎక్కువగా వెతుకుతాం.అదే ఎక్కువ సార్లు నిజం అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఎక్కువ శాతం జరుగుతోంది.
సహనం తగ్గిందా?
చాలా మంది మనలో సహనం తగ్గటం వల్లే ఇలా తీర్పులు పాస్ చేస్తున్నామంటున్నారు. అయితే ఇది సహనం తగ్గిపోయిందనే విషయం మాత్రమే కాదు. మన దృష్టి నిలిచే సమయం తగ్గిపోయింది. ఒకప్పుడు సినిమా మూడు గంటలు చూసి మూడు రోజులు మాట్లాడేవాళ్లు. ఇప్పుడు మూడు నిమిషాల ట్రైలర్ చూసి మూడు సెకన్లులలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ప్రేక్షకుడి తప్పు మాత్రమే కాదు. సోషల్ మీడియా వేగం కూడా అదే నేర్పిస్తోంది.
ట్రోలింగ్‌కు పాత వివాదాలు కూడా కారణమా?
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వారంతా సినిమా అభిమానులే కావాల్సిన అవసరం లేదు. కొందరు నటుడి లేదా నటి గత వివాదాలను గుర్తు చేసుకుని, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఒక ట్రైలర్, ఒక ఇంటర్వ్యూ, ఒక వ్యాఖ్య… ఏదో ఒక సందర్భం దొరికితే పాత విమర్శలన్నీ మళ్లీ బయటకు వస్తాయి.
అందుకే డిజిటల్ యుగంలో ఒక సినిమా ట్రైలర్ కేవలం సినిమా గురించే చర్చను ప్రారంభించదు. కొన్నిసార్లు ఆ నటుడి గతం, ప్రజల్లో ఏర్పడిన ఇమేజ్, పాత వివాదాలు కూడా ఒకేసారి మళ్లీ చర్చలోకి వస్తాయి.
ట్రోలింగ్‌తో సినిమా మారుతుందా?
కొన్నిసార్లు మారుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో చాలా సినిమాలు ట్రైలర్‌పై వచ్చిన విమర్శల తర్వాత VFX మెరుగుపరిచాయి, కలర్ గ్రేడింగ్ మార్చాయి, కొన్ని షాట్లను కూడా సవరించాయి.
అంటే సోషల్ మీడియా స్పందనను దర్శకులు పూర్తిగా పట్టించుకోరని చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం నిజం. ట్రోలింగ్ సినిమా భవిష్యత్తును నిర్ణయించదు. అది ఓ వర్గం ప్రేక్షకుడి ఫస్ట్ ఇంప్రెషన్ ని మాత్రమే ప్రభావితం చేస్తుంది.
చివరికి గెలిచేది కంటెంట్‌నే.
సాయి పల్లవి విషయంలో వస్తున్న విమర్శలు సరైనవేనా?, ట్రోలింగ్ అతిగా జరిగిందా? అనే సమాధానం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ ఈ సంఘటన మరో విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు మనం సినిమా చూసి అభిప్రాయం చెప్పడం లేదు. అభిప్రాయం చెప్పడానికి సినిమా కోసం ఎదురుచూస్తున్నాం.
అందుకే ట్రైలర్ విడుదలైన రోజే తీర్పు వస్తోంది. సినిమా విడుదలయ్యే రోజు… ఆ తీర్పు సరైందో, కాదో మాత్రమే తేలుతోంది.








