ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటా!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) స్టూడియో అంటే కేవలం మ్యూజిక్ కంపోజింగ్ చేసే ప్లేస్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన క్రియేటివ్ వర్క్‌స్పేస్ అనే అభిప్రాయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్టూడియోను చాలా శుభ్రంగా మెయింటైన్ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడి ఒక్కో ఫ్లోర్‌కు ఒక్కో డిఫరెంట్ పేరుంటుందని, వైబ్, జామ్ లాంటి పేర్లను ఫ్లోర్లకు పెట్టడం కూడా ఆ వాతావరణాన్ని క్రియేటివ్ గా మార్చే ప్రయత్నంలో భాగమేనని తెలుస్తోంది. మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ప్రశాంతమైన పరిసరాలు ఎంతో అవసరమని భావించే తమన్, స్టూడియోలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు.
స్టూడియోలో ఆల్కహాల్, సిగరెట్‌కు ఎలాంటి అనుమతి ఉండదని కూడా తమన్ స్పష్టం చేశారు. ఎవరైనా సిగరెట్ తాగాలనుకుంటే బయటకు వెళ్లి తాగి రావాల్సిందేనని, ఈ విషయంలో తాను 2000% స్ట్రిక్ట్ గా ఉంటానని చెప్పారు. స్టూడియోలోకి అలాంటివి తీసుకురావడం తనకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. మ్యూజిక్ పుట్టే చోటు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలనే టార్గెట్‌తో ఈ రూల్స్ ను అమలు చేస్తున్నట్లు వివరించారు.
మంచి సాంగ్స్ లేదా బీజీఎంలు వచ్చినప్పుడు ఏం తాగి ఇలా కొట్టాడురా అనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయని తమన్ నవ్వుతూ చెప్పారు. అయితే తనకు అసలు మందు అలవాటు లేదని, తనకు వచ్చే అసలు హై, కొత్త ట్యూన్ కంపోజ్ చేసినప్పుడే వస్తుందని అన్నారు. ఒక మంచి మెలోడీ లేదా పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రూపొందిన క్షణమే తనకు నిజమైన ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. సంగీతమే తనకు అతిపెద్ద ఎనర్జీ అని ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.








