బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ప్రచారం ప్రారంభం
ప్రతి సంవత్సరం జూలై 30న నిర్వహించే ‘వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్’ సందర్భంగా, అలాగే బంధిత కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం (BLSA) అమలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మరియు ఐజెఎం సంయుక్తంగా రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాయి. బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమిష్టి కృషిని మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సదస్సులో ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, పౌరసమాజ సంస్థల ప్రతినిధులు, బంధిత కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిన బాధితులు, మీడియా ప్రతినిధులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనలో సాధించిన పురోగతిని సమీక్షించడం, అనుభవాలను పంచుకోవడం, బలహీన వర్గాలను దోపిడీ నుంచి రక్షించేందుకు ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించడం ఈ సదస్సు లక్ష్యంగా నిలిచింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (TSLSA) సభ్య కార్యదర్శి శ్రీ చి. పంచాక్షరి, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ కృష్ణ దేవరావు కలిసి *’స్వేచ్ఛా రథం’*ను ప్రారంభించారు. ఈ అవగాహన వాహనం తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటిస్తూ బంధిత కార్మిక వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడం, గ్రామీణ స్థాయిలో చైతన్యం పెంపొందించడం, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది.
ఈ అవగాహన కార్యక్రమం తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేర్కొన్న “బంధిత కార్మిక వ్యవస్థ, ఆధునిక బానిసత్వానికి తెలంగాణలో స్థానం ఉండకూడదు” అనే సంకల్పానికి అనుగుణంగా రూపొందించబడింది. దోపిడీకి గురవుతున్న కార్మికులు భయపడకుండా ముందుకు వచ్చి ప్రభుత్వ సహాయాన్ని పొందేలా ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
380 మందికి పైగా బంధిత కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిన బాధితులు పాల్గొన్న ఈ సదస్సు స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. అనంతరం పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ, BLSA చట్టం సమర్థవంతమైన అమలు, బాధిత కేంద్రిత నివారణ, రక్షణ, పునరావాసం, న్యాయం అందించడంలో ప్రభుత్వం, విద్యాసంస్థలు, పౌరసమాజ సంస్థల సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
శ్రీ చి. పంచాక్షరి మాట్లాడుతూ, “BLSA చట్టం అమలై 50 సంవత్సరాలు గడిచినా బంధిత కార్మిక వ్యవస్థ కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మానవ అక్రమ రవాణా, బంధిత కార్మిక వ్యవస్థలు కేవలం చట్టపరమైన సమస్యలు మాత్రమే కావు. అవి మానవ గౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు సంబంధించిన అంశాలు. వీటి నిర్మూలనకు పోలీసు, రెవెన్యూ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖలు, పౌరసమాజ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గ్రామాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మొబైల్ లీగల్ అవేర్నెస్ వాహనాల ద్వారా బంధిత కార్మిక వ్యవస్థతో పాటు ఇతర న్యాయ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది” అని తెలిపారు.
నల్సార్ వైస్ ఛాన్సలర్ శ్రీ కృష్ణ దేవరావు మాట్లాడుతూ, “బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తొలి అడుగు ఫిర్యాదు చేయడం. ఆ తర్వాత రక్షణ, విముక్తి, పునరావాసం కొనసాగాలి. జిల్లా విజిలెన్స్ కమిటీలు మరింత చురుకుగా పనిచేయాలి. రక్షణతో మాత్రమే సరిపోదు. బాధితులకు స్థిరమైన జీవనోపాధి లేకపోతే వారు మళ్లీ దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే పునరావాసం నిరంతర ప్రక్రియ కావాలి. జిల్లా విజిలెన్స్ కమిటీలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పౌరసమాజ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, పంచాయతీరాజ్ సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవల సంస్థ తదితర భాగస్వాములంతా కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
ఐజెఎం జాతీయ కార్యక్రమాల డైరెక్టర్ శ్రీమతి మెర్లిన్ ఫ్రీడా మాట్లాడుతూ, “యాభై సంవత్సరాల క్రితం BLSA చట్టం ద్వారా భారత్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అప్పు పేరుతో ఎవరి స్వేచ్ఛనూ కొనలేరు, అమ్మలేరు, వారసత్వంగా బదిలీ చేయలేరు, నియంత్రించలేరు అని ఆ చట్టం స్పష్టం చేసింది. ప్రతి కార్మికుడు స్వేచ్ఛగా, గౌరవంగా, భద్రంగా జీవించే హక్కు కలిగి ఉన్నాడనే సందేశాన్ని అది ఇచ్చింది. అయినప్పటికీ నేటికీ రాతి గనులు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు తదితర రంగాల్లో కార్మికులు దోపిడీకి గురవుతున్నారు. అందుకే ఈ రోజు కేవలం ఒక కార్యక్రమం కాదు. అవగాహనను కార్యాచరణగా, నిబద్ధతను నిరంతర సమిష్టి ఉద్యమంగా మార్చే ప్రయాణానికి నాంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా *’బంధిత కార్మిక అవగాహన గీతం’*ను ఆవిష్కరించారు. ఈ గీతాన్ని గాయకుడు, గేయ రచయిత, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ సలహా కమిటీ సభ్యుడు పల్లె నరసింహ ఆలపించారు. బంధిత కార్మిక వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెంచడం, అనుమానాస్పద ఘటనలను గుర్తించి అధికారులకు సమాచారం అందించేలా ప్రోత్సహించడం ఈ గీతం ఉద్దేశ్యం. బాధితులను రక్షించి పునరావాసం కల్పించేందుకు కార్మిక శాఖ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని ఈ గీతం ప్రజలకు పిలుపునిస్తుంది.
ఈ సందర్భంగా ‘BLSA చట్టం – 50 సంవత్సరాలు’ పేరుతో రూపొందించిన స్మారక పుస్తకాన్ని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించేందుకు బంధిత కార్మిక హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ సదస్సులో అత్యంత హృదయస్పర్శకమైన అంశంగా బంధిత కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిన బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు. దోపిడీ, రక్షణ, పునరావాసం, పునర్నిర్మిత జీవిత ప్రయాణాన్ని వివరించిన వారి అనుభవాలు, సమయానికి జోక్యం చేసుకోవడం, దీర్ఘకాలిక సహాయం ఎంతటి మార్పును తీసుకురాగలదో స్పష్టం చేశాయి.
అమరగిరి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు, బంధిత కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిన పి. లింగమ్మ మాట్లాడుతూ, “నా జీవితంలో ఎక్కడైనా బంధిత కార్మిక వ్యవస్థలో బాధపడుతున్నవారిని, అన్యాయానికి గురవుతున్నవారిని చూస్తే వారికి అండగా నిలుస్తాను. అధికారులు మాకు సహాయం చేశారు. నేను కూడా పేదలకు తోడుగా ఉంటాను. ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంది. బంధిత కార్మికులను విముక్తి చేసి వారికి స్వేచ్ఛ కల్పించేందుకు నేను సిద్ధంగా ఉంటాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాజువెల్లి ప్రతాప్ కల్చరల్ గ్రూప్ బంధిత కార్మిక వ్యవస్థ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే నాటికను ప్రదర్శించింది. దోపిడీ నుంచి స్వేచ్ఛ వరకు ఒక బాధితుడి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, బంధిత కార్మిక వ్యవస్థ వల్ల కలిగే మానవీయ నష్టాన్ని, దాని నిర్మూలనకు సమిష్టి కృషి అవసరాన్ని ఈ నాటిక ద్వారా తెలియజేశారు.
బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ వ్యవస్థలు, పౌరసమాజ సంస్థలు, విద్యాసంస్థలు, సమాజం కలిసి పనిచేయాలనే నూతన సంకల్పంతో ఈ రాష్ట్రస్థాయి సదస్సు ముగిసింది. సమన్వయపూర్వక చర్యలు, ప్రజల్లో అవగాహన, బాధితుల నాయకత్వం, సృజనాత్మక ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా మాత్రమే బంధిత కార్మిక వ్యవస్థలేని తెలంగాణను నిర్మించగలమని ఈ సదస్సు పునరుద్గాటరించింది.








