ఇదో వింత కథ: ప్రభుత్వం కోర్టులో ఓడింది సరే, లాయర్లు ఫీజ్ కట్టేది ఎవరు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
దేశ అధ్యక్షుడు పెన్ను తీసుకున్నాడు.
కొన్ని సెకన్లలో వరుస సంతకాలు చేశాడు. దేశంలో విధానాలు మొత్తం మారిపోయాయి.
కొన్ని నెలల తర్వాత… అదే సంతకాలకు వందల కేసులు నమోదయ్యాయి. మరో కొద్ది కాలానికి…కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు.
ఇప్పుడు…
కోట్ల రూపాయల లాయర్ బిల్లులు. వాటిని ఎవరు పే చెయ్యాలి అనేదే పెద్ద సమస్య. ఆ అధ్యక్ష్యుడు డోనాల్డ్ ట్రంప్. జరిగింది అమెరికాలో. అందుకే అక్కడ మీడియాలో ఇదే పెద్ద చర్చ.
ఎందుకంటే ఆ లాయర్ల బిల్లులు ఏమీ డోనాల్డ్ ట్రంప్ ఇంటికి వెళ్లలేదు. వైట్ హౌస్‌కు కూడా వెళ్లలేదు. అమెరికా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాయి. అయితే ఇక్కడో మెలిక ఉంది. ఆ ఖజానా నింపేది ఎవరు? పన్నులు కట్టే సాధారణ ప్రజలు. ఇదే ఇప్పుడు అమెరికాలో చర్చకు దారితీసిన అసలు కథ.
అసలేం జరిగింది?
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వేగంగా వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసింది. విదేశీ విద్యార్థుల చట్టబద్ధ హోదా నుంచి… పేదలకు ఇచ్చే ఆహార సహాయం వరకు… విశ్వవిద్యాలయాల పరిశోధన నిధుల నుంచి… వాషింగ్టన్‌లోని సైకిల్ లేన్ల వరకు… అనేక నిర్ణయాలు ఒకదాని తర్వాత ఒకటి వెలువడ్డాయి. వైట్ హౌస్‌లో ఆ సంతకాలు పెట్టడానికి కొన్ని సెకన్లు మాత్రమే పట్టింది. కానీ… ఆ నిర్ణయాలు కోర్టుల గడప దాటడానికి మాత్రం నెలలు పట్టాయి.
వందల కేసులు… ప్రభుత్వానికి వరుస షాక్‌లు
ఆ నిర్ణయాలపై విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. స్వచ్ఛంద సంస్థలు వెళ్లాయి. విశ్వవిద్యాలయాలు వెళ్లాయి. సామాజిక సంస్థలు వెళ్లాయి. అమెరికా ఫెడరల్ కోర్టుల్లో వందల కేసులు నమోదయ్యాయి. విచారణలు జరిగాయి. కొన్ని కీలక కేసుల్లో కోర్టులు ప్రభుత్వ నిర్ణయాలు చట్టపరమైన పరీక్షలో నిలవలేదని తేల్చాయి. ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. చాలామందికి కథ ఇక్కడితో ముగిసిందనిపిస్తుంది.
కానీ…అసలు కథ అప్పుడే మొదలైంది
సాధారణంగా కేసులో ఓడిపోతే తీర్పు వస్తుందని మనం అనుకుంటాం. కానీ అమెరికాలో కొన్ని పరిస్థితుల్లో… ప్రభుత్వం కోర్టులో ఓడిపోతే… ఎదుటి పక్షం తరఫున పోరాడిన లాయర్ల ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి రావచ్చు. దీనికోసమే 1980లో Equal Access to Justice Act అనే చట్టాన్ని తీసుకొచ్చారు.అలా ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసినా…”లాయర్ పెట్టుకునే డబ్బు లేదు” అని సామాన్యుడు వెనక్కి తగ్గకూడదనేదే ఆ చట్టం ఉద్దేశం.
అంటే…ప్రభుత్వం చట్టపరంగా తన నిర్ణయాన్ని సమర్థించలేకపోతే… దానికి మూల్యం ప్రభుత్వమే చెల్లించాలి. ఈ క్రమంలో ఇప్పుడు కోట్ల రూపాయల బిల్లులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కీలక కేసులు ముగియడంతో… లాయర్లు తమ ఫీజుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
బ్లూమ్‌బెర్గ్ విశ్లేషణ ప్రకారం… ఇప్పటికే కనీసం 10 కేసుల్లో రూ.20 కోట్లకు పైగా (సుమారు 2.5 మిలియన్ డాలర్లు) లాయర్ ఫీజులను డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రాధమిక అంచనా లెక్క మాత్రమే. కొన్ని పరిశోధన నిధుల కేసుల్లో…లాయర్లు రూ.12 కోట్లకుపైగా ఫీజులు కోరుతున్నారు.మరికొన్ని కేసుల్లో లక్షలు, కోట్ల రూపాయల క్లెయిమ్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
అంటే…
కోర్టు తీర్పు ముగిసినా…ప్రభుత్వ ఖర్చు మాత్రం ఇంకా ముగియలేదు. ఇదే కథలోని పెద్ద ఐరనీ. ఇప్పుడు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఒకే వాదన చేస్తోంది. “లాయర్లు అడుగుతున్న ఫీజులు చాలా ఎక్కువ. ట్యాక్స్‌పేయర్ల డబ్బును కాపాడాలి ” అని. కానీ… ఇక్కడే పెద్ద ప్రశ్న మొదలవుతోంది. ముందు అదే ప్రభుత్వం… ఆ నిర్ణయాలను సమర్థించడానికి కోర్టుల్లో పోరాడింది. అందుకోసం ప్రభుత్వ న్యాయవ్యవస్థ, అధికారులు, ప్రజా ధనం ఖర్చయ్యాయి. ఇప్పుడు… కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడంతో… ఎదుటి పక్షం లాయర్ల ఫీజులు కూడా అదే ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే… ఒకే నిర్ణయం కోసం ప్రజల ధనం రెండుసార్లు ఖర్చవుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు అమెరికాలో వినిపిస్తోంది.
ఇది ట్రంప్ కథ మాత్రమే కాదు… ప్రతి ప్రభుత్వానికి వర్తించే పాఠం
ఈ కథలో ప్రధాన పాత్ర ట్రంప్ కాదు. ప్రధాన పాత్ర ప్రజల పన్నుల డబ్బు. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు. కానీ… ఆ నిర్ణయాలు చట్టపరంగా నిలవకపోతే… దాని రాజకీయ మూల్యం నాయకులు చెల్లించవచ్చు. ఆర్థిక మూల్యం మాత్రం చివరికి పన్ను చెల్లింపుదారులే భరించాల్సి వస్తుంది.
చివరి మాట
ఒక సంతకం పెట్టడానికి కొన్ని సెకన్లు చాలు. ఒక కేసు దాఖలు చేయడానికి కొన్ని రోజులు చాలు. ఒక తీర్పు రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ… ఆ లీగల్ ఖర్చును ప్రజలు సంవత్సరాల పాటు భరించాల్సి రావచ్చు. అమెరికాలో ఇప్పుడు నడుస్తున్న అసలు చర్చ ఇదే. ట్రంప్ కోర్టులో గెలిచాడా, ఓడిపోయాడా అన్నది కాదు…ఒక ప్రభుత్వ నిర్ణయానికి చివరికి ధర చెల్లించేది ఎవరు?








