ఆటా మహాసభల్లో ‘తెలుగు వైభవం’ నృత్యరూపకం
అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అత్యంత అంగరంగ వైభవంగా జరగనున్న 19వ అమెరికా తెలుగు మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మహాసభల ప్రారంభోత్సవ వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రారంభోత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ‘తెలుగు వైభవం’ పేరుతో నృత్య రూపకం ప్రదర్శిస్తున్నట్లు ప్రారంభోత్సవ కమిటీ చైర్ సుధా కొండపు తెలిపారు. ఈ కమిటీలో కో చైర్ గా రుద్రభీంరెడ్డి, సభ్యులుగా కల్పన బోయినపల్లి, సాయికాంత రాపర్ల ఉన్నారు. అడ్వయిజర్ గా ఇందిరా శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.
ఈ ‘తెలుగు వైభవం’ నృత్య రూపకానికి ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, యశోకృష్ణ మ్యూజిక్ డైరెక్షన్, సురేష్ ఉత్తరాది ఏవీ డిజైన్ చేశారు. న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, డెలావేర్, వర్జీనియా, మేరీల్యాండ్ తదితర ప్రాంతాలకు చెందిన 7 ప్రముఖ డాన్స్ స్కూళ్లకు చెందిన 150 మంది నృత్య కళాకారులు గత కొద్ది నెలలుగా శ్రమించి ఈ ప్రదర్శనను సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల సంస్కృతి, చరిత్ర, నదులు, స్వాతంత్య్ర సమరయోధులు, కళలు, ఓరుగల్లు ప్రాశస్త్యం మరియు సినీ దిగ్గజాల ఘనతను ప్రతిబింబించేలా ఈ రూపకాన్ని తీర్చిదిద్దినట్లు సుధా కొండపు తెలిపారు.








