“పాకిస్తానీ కాశ్మీర్ అంటూ ఏమీ లేదు : న్యూయార్క్ టైమ్స్ పై భారత్ తీవ్ర స్పందన
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న ఘర్షణలపై అమెరికాకి చెందిన న్యూయార్క్ టైమ్స్ POJK పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను “పాకిస్తానీ కాశ్మీర్” అని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ను “పాకిస్తానీ కాశ్మీర్”గా ‘ది న్యూయార్క్ టైమ్స్’ అభివర్ణించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ భూభాగం భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది.
అలాగే న్యూ యార్క్ టైమ్స్ ప్రచురించిన శీర్షికపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. , “పాకిస్తానీ కాశ్మీర్ అంటూ ఏమీ లేదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే ఉంది”.అని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ, ఇప్పుడు కూడా భారతదేశంలో అంతర్భాగం. విడదీయరానివిగా వున్నాయి. ఎల్లప్పుడూ అలాగే వుంటాయి. పాకిస్తాన్ ఈ భూభాగాల్లోని కొన్ని భాగాలను అక్రమంగా ఆక్రమించుకుంది మరియు ఇప్పుడు ఆక్రమిత ప్రజలపై హింసను ప్రయోగిస్తోంది.’’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే నిరసనలు కూడా చోటుచేసుకోవడంతో, అక్కడ అశాంతి తీవ్రమవుతున్న నేపథ్యంలో పాక్ ఈ ప్రకటనను విడుదల చేసింది. పాకిస్తానీ భద్రతా దళాలు నిరసనకారులపై దాడులు చేయడంతో 30 మందికి పైగా పౌరులు మరణించగా, కనీసం 33 మంది గాయపడ్డారు.ఈ ప్రాంతంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పాలన, ఆరోపిత రాజకీయ వివక్ష, మైనారిటీ వర్గాల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తోంది.







