మన్మోహన్ సింగ్ మిస్టర్ క్లీన్… నిర్దోషి అని చెప్పిన సుప్రీం కోర్టు
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, ఆయన పదవీకాలంపై నీడలా కమ్ముకున్న ఓ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న క్రిమినల్ కేసును, ఆయనకు జారీ చేసిన సమన్ల ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక కోర్టు గతంలో జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కొట్టివేస్తూ కేసును శాశ్వతంగా క్లోజ్ చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు ఇతరులకు విచారణ సంస్థ క్లీన్ చిట్ ఇస్తూ సమర్పించిన క్లోజర్ నివేదికలను సుప్రీంకోర్టు ఆమోదించింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులను తోసిపుచ్చి, ట్రయల్ కోర్టు మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహించారు. ఒడిశాలోని తలబీరా -2 బొగ్గు బ్లాక్ ను అక్రమంగా హిండోల్కా ఇండస్ట్రీస్ కి కేటాయించారన్న ఆరోపణతో కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. 2015 లో వెలుగు చూసిన ఈ కేసులో సీబీఐ విచారణ ఆదేశించారు. పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరాఖ్ పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని కూడా నిందితుడిగా పిలిపించింది సుప్రీం.








