పార్లమెంట్ లో వందేమాతరం బిల్లు ఆమోదం
వందేమాతరం బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళన మధ్య మూజువాని ఓటుతో లోక్ సభలో గురువారం ఆమోదం పొందింది. అలాగే రాజ్యసభలో కూడా బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. దీని తర్వాతే ఆమోదం పొందింది. గురువారం లోక్ సభలో ఆమోదం పొందడంతో ఉభయ సభల్లోనూ ఆమోదం పొందినట్లైంది.
ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, లేదా ఎవరైనా ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా దాన్ని చట్టప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చింది.
ప్రస్తుతం రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానిస్తే గరిష్టంగా 3 సంవత్సరా జైలు శిక్ష విధించే నిబంధనలు వున్నాయి. ఈ సవరణ అమలులోకి వచ్చిన తర్వాత వందేమాతరం పాడే సమయంలో అవమానించడం, అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం వంటివి చేసినా అదే శిక్ష వర్తిస్తుంది. గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు, జరిమానా లేక రెండూ విధించవచ్చు.
వందేమాతరం బిల్లులో భాగంగా చరిత్రాత్మక ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ – 1971’ (జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక చట్టం)లో కీలక సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం భారత జాతీయ గీతమైన ‘జనగణమన’కు ఎలాంటి చట్టపరమైన రక్షణలు అమల్లో ఉన్నాయో.. అవే అత్యున్నత రక్షణలను జాతీయ గేయమైన వందేమాతరానికి కూడా వర్తింపజేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.







