ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు.. టీటీడీ విడుదల చేసిన పూర్తి షెడ్యూల్
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం (Sri Venkateswara Temple)లో ప్రతి నెలా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటారు. భక్తులు ముందుగానే తమ యాత్రను ప్రణాళిక చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతి నెల నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా ఆగస్టు నెలలో నిర్వహించనున్న ముఖ్యమైన పర్వదినాలు, ఉత్సవాల షెడ్యూల్ను టీటీడీ వెల్లడించింది.
ఆగస్టు 14న శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు నిర్వహించనున్నారు. ఆగస్టు 16న నాగ చతుర్థి (Naga Chaturthi) సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అదే రోజున కశ్యప మహర్షి (Kashyapa Maharshi) జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 17న గరుడ పంచమి (Garuda Panchami) సందర్భంగా శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆగస్టు 21న ప్రముఖ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) వర్ధంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఆగస్టు 25న ముగియనున్నాయి. ఆలయంలో జరిగే నిత్యారాధనల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి పరిహారంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి (Shravana Pournami) సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అదే రోజు గరుడ వాహన సేవతో పాటు శ్రీ విఖనస మహాముని (Sri Vikhanasa Maharshi) జయంతి, శ్రీ హయగ్రీవ స్వామి (Sri Hayagriva) జయంతి కూడా నిర్వహించనున్నారు. ఆగస్టు 29న శ్రీవారు విఖనసాచార్యుల (Vikhanasacharya) సన్నిధికి వేంచేపు నిర్వహించడం మరో విశేషం.
ఇక తిరుపతి (Tirupati)లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple)లో కూడా ఆగస్టు నెలంతా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆగస్టు 5 నుంచి 14 వరకు ఆండాళ్ తిరువాడిపురం (Andal Thiruvadipuram) ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆగస్టు 12న చక్రతాళ్వార్ (Chakrathalwar), శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ (Prativadi Bhayankaram Annan) తిరునక్షత్ర వేడుకలు జరగనున్నాయి.
ఆగస్టు 16న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు కూడా భక్తులను ఆకట్టుకోనుంది.
ఆగస్టు 26న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి (Kalyana Venkateswara Swamy) ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. అలాగే ఆగస్టు 28న శ్రావణ ఉపకర్మ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కృష్ణస్వామివారిని కపిలతీర్థం (Kapila Theertham)లోని ఆళ్వార్ తీర్థానికి తీసుకెళ్లి స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం వైఖానసాచార్యుల ఆలయంలో ప్రత్యేక ఆస్థానం జరగనుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ముందుగానే తేదీలు తెలుసుకుని తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.








