అన్నమయ్యపుర “గురు” పూజోత్సవ వైభవం – 108+ శిష్యులచే ముక్త కంఠంతో అన్నమ స్వరార్చన
గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ హైటెక్స్ కమాన్ దగ్గరలోని అన్నమాచార్య భావనా వాహిని – అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారికి అత్యంత భక్తిశ్రద్ధలతో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు.
భారతీయ గురుపరంపరకు ప్రతీకగా, అన్నమాచార్యుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్మరించుకుంటూ జరిగిన ఈ వేడుక భక్తి, సంగీత, గురుభక్తి సమ్మేళనంగా విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమం ప్రారంభంలో మూడుసార్లు ఓంకార నాదం, అనంతరం నాలుగు వేద మంత్రాల పారాయణం, “శ్రీనందకాయ – అన్నమ గాయత్రి” ప్రార్థనతో సభ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం అన్నమాచార్య భావనా వాహినికి చెందిన 108 మందికి పైగా విద్యార్థులు పద్మశ్రీ డా. శోభారాజు గారికి గురుపూజ సమర్పించి, సమిష్టిగా అన్నమాచార్య సంకీర్తనలను ఆలపిస్తూ గురుభక్తిని చాటారు.
ఈ సందర్భంగా “హరి అవతారమితడు”, “మాతృ దేవో భవ”, “తాళ్ళపాక అన్నమాచార్య”, “గురు పాదుకా స్తోత్రం”, “కంటి అఖిలాండ”, “గురుపాద పంకేరుహం”, “చిత్తము కొలది”, “నీవు లేకుంటే”, “శ్రీ కల్కి దేవ”, “ఎంత చక్కని ధనివమ్మ” వంటి భక్తిరసభరితమైన కీర్తనలను వివిధ రాగాలలో ఆలపించి సభికులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు. విద్యార్థుల గానం శ్రుతి, లయ, భక్తి భావాల సమన్వయంతో ఆకట్టుకుని గురుపూర్ణిమ వేడుకలకు మరింత శోభను చేకూర్చింది.
కాగా ఈ సభక్తి పూర్వక సంగీత సమర్పణకు శ్రీనివాస్ కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించి కార్యక్రమానికి మరింత మాధుర్యాన్ని జోడించారు.
ఈ గురుపూజోత్సవానికి ప్రముఖ సినీ నటుడు, రచయిత బాలాదిత్య ముఖ్య అతిథిగా విచ్చేసి, “గురువు స్థానం జీవితంలో అత్యున్నతమని పేర్కొంటూ, పద్మశ్రీ డా. శోభారాజు గారు వేలాది మందికి అన్నమయ్య సంకీర్తనలను చేరవేసి భక్తి సంగీతానికి చేస్తున్న సేవలను కొనియాడారు.”
ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు గురుపరంపర గొప్పతనం, అన్నమాచార్యుల సంకీర్తనల ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక విలువలను విస్తరింపజేస్తున్న పద్మశ్రీ డా. శోభారాజు గారి విశిష్ట సేవలను వివరించి, విద్యార్థులు గురుభక్తితో సంగీత సాధన కొనసాగించాలని ఆకాంక్షించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన పద్మశ్రీ డా. శోభారాజు గారు మాట్లాడుతూ గురువు గొప్పతనాన్ని విశేషంగా వివరిస్తూ తమ దివ్య సందేశాన్ని తెలిపారు.
కార్యక్రమం ముగింపులో గురు స్తుతితో పాటు మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.
గురుపూర్ణిమ సందర్భంగా నిర్వహించిన ఈ గురుపూజోత్సవం గురుభక్తి, సంగీత భక్తి, అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని ప్రతిబింబిస్తూ అత్యంత వైభవంగా విజయవంతమైంది.








