ప్రధాని మోదీని కించపరిచే పోస్టులు.. మెటా భారత్ హెడ్ పై కేసులు
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఈ కేసులు నమోదయ్యాయి.
బీజేపీ సోషల్ మీడియా ప్రతినిధి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఇన్ స్టా, ఫేస్ బుక్ ఆపరేటర్లు, మెటా ఇండియా హెడ్ పై కేసులు నమోదు అయ్యాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనల సమయంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రచురించిన కంటెంట్‌కు సంబంధించి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదు ప్రకారం, ఆ కంటెంట్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు మోడీని అసభ్యకరంగా చూపిస్తూ మార్ఫింగ్ చేసిన దృశ్యాలు, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క మార్ఫింగ్ చేసిన చిత్రం ఉన్నాయి. ఆ కంటెంట్‌ను డిజిటల్‌గా మార్ఫింగ్ చేసినట్లు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించి, ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.








