టిబెట్ లో చైనా డ్రోన్ హబ్… భారత్ రక్షణ సమాచారంపై కన్ను..!
కమ్యూనిస్ట్ చైనా వ్యూహాత్మకంగా భారత్ ను చుట్టుముడుతోంది. ఓవైపు ముత్యాల సరాలతో భారత్ ను దిగ్భందనం చేస్తూనే.. మరోవైపు.. ప్రపంచ పైకప్పుపై డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తోంది. అంటే అటు నుంచి భారత్ కు చెందిన కీలక రక్షణ రహస్యాల సేకరణకు బీజం వేస్తోంది. ఈ పరిణామం సహజంగానే భారత్ కు ఇబ్బంది కరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎత్తయిన ప్రాంతాల్లో సరిహద్దు గస్తీ, భద్రత, రవాణా వంటి కార్యకలాపాలను బలోపేతం చేసుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. ఆ ప్రాంతాల్లో మోహరించేందుకు అవసరమైన డ్రోన్ల రూపకల్పన కోసం ఎవరెస్టు పర్వతానికి చేరువగా టిబెట్‌లో ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించింది. సాధారణంగా టిబెట్‌ను ‘ప్రపంచ పైకప్పు’గా పిలుస్తుంటారు. అది సముద్రమట్టానికి 4 వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువ. వాతావరణం త్వరత్వరగా మారిపోతుంటుంది. ఎత్తయిన ప్రాంతాల్లో మోహరింపునకు అవసరమైన మానవరహిత గగనతల వాహన (యూఏవీ) సాంకేతికతల అభివృద్ధికి టిబెట్ పరిస్థితులు ఆదర్శంగా ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ పీఠభూమి డ్రోన్ పరిశోధన, అభివృద్ధి అనువర్తన కేంద్రాన్ని ఈ నెలారంభంలోనే ఏర్పాటుచేశారు.
మరోవైపు… ఏ క్షణంలోనైనా భారత్ దిశగా దూసుకెళ్లేందుకు వీలుగా 12 అత్యాధునిక జె-20 స్టెల్త్ యుద్ధవిమానాలను చైనా మోహరించి ఉంచినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తాజాగా వెల్లడైంది. వీటిలో 8 యుద్ధవిమానాలు షింజియాంగ్ ప్రావిన్సులోని హోటన్ వైమానిక స్థావరంలో, మిగిలిన 4 టిబెట్‌లోని డామ్క్సంగ్ ఎయిర్‌బేస్‌లో ఉన్నాయి. భారత్ లక్ష్యంగా ఇంత పెద్ద సంఖ్యలో అత్యాధునిక యుద్ధవిమానాలను చైనా మోహరించి ఉంచడం ఇటీవలి ఏళ్లలో ఇదే తొలిసారి. ఉత్తర లద్దాఖ్‌లో మన దేశానికి చెందిన దౌలత్ బెగ్ ఓల్డీ వైమానిక స్థావరం నుంచి హోటన్ కేవలం 245 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.








