ఓవైపు 2030 అభివృద్ధి ప్రణాళిక.. మరోవైపు ఇరాన్ యుద్ధం..!
పశ్చిమాసియా సంక్షోభం.. అమెరికా మిత్రపక్షం సౌదీ అరేబియాకు కఠిన సమస్యను తెచ్చిపెట్టింది. ఓవైపు ఈ వార్ కు ముందుగా తీసుకున్న 2030 అభివృద్ధి ప్రణాళిక… ఇది ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విజన్.. దీనికి అధిక ప్రాధాన్యమిస్తోంది సౌదీ. అయితే ఇలాంటి సమయంలోనే ఇరాన్ తీవ్రదాడులు.. సౌదీకి పరీక్షగా నిలిచాయి. దీంతో యుద్ధంలో పూర్తిస్థాయిలో పాల్గొనాలా..? విజన్ 2030కి ప్రాధాన్యమివ్వాలా అన్నది తేల్చుకోలేకపోతోంది సౌదీ అరేబియా.
పశ్చిమాసియా మళ్లీ దద్దరిల్లుతోంది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా.. గల్ఫ్ లో యూఎస్ మిత్రపక్షాలపై టెహ్రాన్ భీకరంగా విరుచుకుపడుతున్నాయి. అయితే మిగతా దేశాల సంగతెలా ఉన్నా.. పశ్చిమాసియాలో అత్యంత ధనిక దేశమైన సౌదీ అరేబియా మాత్రం ప్రస్తుతం తీవ్ర అయోమయానికి గురవుతోంది. తనపై దాడులకు దిగుతున్న శక్తులపై ప్రతి దాడులను కొనసాగించాలా.. వద్దా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా బాగా ఇబ్బందిపడుతున్న దేశాల్లో సౌదీ ఒకటి. తొలినాళ్లలో దానిపై టెహ్రాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు కొన్నాళ్లుగా సౌదీపై దాడులను ఉద్ధతం చేస్తున్నారు. ఇటీవల ఇరాక్ నుంచి.. ఇరాన్ మద్దతున్న మిలీషియాలూ డ్రోన్లతో విరుచుకుపడటం మొదలుపెట్టాయి. దీంతో తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురైన రియాధ్.. అమెరికాతో కలిసి ఇరాక్‌లోని మిలీషియాలపై ఈ వారంలో దాడులు చేసింది. కానీ శత్రువులపై దాడులను కొనసాగించాలా లేక సంయమనం పాటిస్తూ ఉద్రిక్తతల తగ్గింపునకు దౌత్యమార్గాల్లో కృషి చేయాలా అన్న విషయంలో గందరగోళంలో ఉంది.
వాస్తవానికి సౌదీ ధనిక దేశమే. కానీ ఆదాయం కోసం అది చమురుపైనే అత్యధికంగా ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని మార్చి, ఆధునిక ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు యువరాజు (క్రౌన్ ప్రిన్స్) మహమ్మద్ బిన్ సల్మాన్ ‘విజన్ 2030’కి శ్రీకారం చుట్టారు. యువతకు ఏటా లక్షల ఉద్యోగాలను కల్పించే విభిన్న స్వదేశీ పరిశ్రమలను స్థాపించడం, విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడం, అత్యాధునిక డేటా సెంటర్లను నిర్మించడం వంటివి దాని లక్ష్యాలు. దాడులను కొనసాగిస్తే యుద్ధంలో పూర్తిగా తలదూర్చినట్లవుతుందని, అప్పుడు ‘విజన్ 2030’ నీరుగారిపోతుందని సౌదీ ఆందోళన చెందుతోంది. అలాగని ప్రతిఘటించకుండా శాంతి మంత్రమే జపిస్తూ కూర్చుంటే శత్రువులు మరింత రెచ్చిపోతారేమోనని తల పట్టుకుంటోంది.
యుద్ధంతో హర్మూజ్ దాదాపుగా మూతపడటం సౌదీకీ దెబ్బే. కానీ తమ తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ ద్వారా ఎర్ర సముద్ర తీరంలోని టెర్మినల్‌కు రోజుకు దాదాపు 50 లక్షల బ్యారెళ్ల చమురును అది తరలిస్తూ వచ్చింది. అక్కణ్నుంచి ఎగుమతులను కొనసాగించింది. అయితే యెమెన్ రాజధాని సనాలోని విమానాశ్రయంపై రియాధ్ ఈ నెల 31న దాడి చేయడంతో హూతీలు ఆగ్రహించారు. సౌదీని దిగ్బంధించి, ఎర్ర సముద్రంలో ఆ దేశానికి నౌకల రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దాడులకు దిగితే.. హూతీలు, ఇరాకీ మిలీషియాలు మరింత రెచ్చిపోయి తమ చమురు కేంద్రాలు సహా ఇతర మౌలిక వసతులను ధ్వంసం చేసే ముప్పుందన్నది సౌదీ భయంగా కనిపిస్తోంది.








