వన్డే వరల్డ్ కప్.. 12 వేదికలు ఖరారు..!
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ – 2027 (ODI World Cup 2027) వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. మొత్తం 12 వేదికలలో ఈ మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రధాన ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికాలోనే అత్యధికంగా 8 స్టేడియాలను ఎంపిక చేశారు. మిగిలిన వాటిలో జింబాబ్వేలో 3 వేదికలు, నమీబియాలో ఒక వేదికను ఖరారు చేశారు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం విశేషం.
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఒక అట్టహాసమైన కార్యక్రమంలో ఈ వేదికల వివరాలను వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో వాండరర్స్ (జోహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (ట్ష్వానే), న్యూలాండ్స్ (కేప్ టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గెబెహా), మాంగాంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటైన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫెలో పార్క్ (ఈస్ట్ లండన్) వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో)తో పాటు కొత్తగా నిర్మించిన ఫేల్ మోసి-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్)లను ఎంపిక చేశారు.
నమీబియాలోని విండ్హోక్లో ఉన్న నమీబియా క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ 2027 వన్డే ప్రపంచ కప్‌లో సరికొత్త త్రీ-స్టేజ్ ఫార్మాట్లో మొత్తం 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “24 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆఫ్రికాకు తిరిగి రావడం క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ.. ఒక మరపురాని ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తాయనే నమ్మకం మాకుంది” అని స్పష్టం చేశారు.








