భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం..!
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ప్రారంభోత్సవానికి రవాణా శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించనుండటంతో కూటమి ప్రభుత్వం దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని సుమారు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.
ఈ భారీ రవాణా ఏర్పాట్లను స్వయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గత వారం రోజుల నుండి విశాఖపట్నంలోనే మొహరించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జనసమీకరణ కోసం రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. మొత్తం 5,000 వాహనాలను సిద్ధం చేశారు. ఇందులో 2,000 ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులు ఉండగా, మరో 3,000 ప్రైవేట్ వాహనాలను కూడా కేటాయించారు. సభకు వచ్చే వారు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా, అనుకున్న సమయానికి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా రవాణా శాఖ అధికారులు రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో పార్కింగ్ స్థలాలను కూడా భారీగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కఠిన భద్రతా నిబంధనలు అమలులో ఉన్నాయి. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ వేడుకను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.








