కృష్ణా డెల్టా రైతులకు కృష్ణమ్మ గుడ్ న్యూస్..!
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నదిపై(Krishna) ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుండి శ్రీశైలానికి(Srisailam) ప్రస్తుతం 1,05,709 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద ప్రవాహం కారణంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 830.70 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 50.26 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుండి వరద నిరంతరాయంగా వస్తుండటంతో రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా బేసిన్లో ఈ తరహా వరద ప్రవాహం కొనసాగడం కృష్ణా డెల్టా రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. సాధారణంగా సాగునీటి సీజన్ ఆరంభంలో ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న కృష్ణా డెల్టా పంటలను కాపాడటానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాలే ప్రధాన ఆధారం. ఇప్పుడు శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో, దిగువన ఉన్న సాగర్, ప్రకాశం బ్యారేజీలకు కూడా త్వరలోనే నీటి లభ్యత పెరగనుంది. దీనికి తోడుగా, అటు గోదావరి నదికి కూడా భద్రాచలం వద్ద వరద పోటెత్తి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు మళ్లీ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎగువన జూరాల నుండి వస్తున్న కృష్ణా జలాలు, అటు పట్టిసీమ ద్వారా రాబోయే గోదావరి జలాలు తోడైతే కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాల పంటలకు సాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఇటీవల పట్టిసీమ పంపులను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు గోదావరి, కృష్ణా రెండు నదులకూ ఒకేసారి వరదలు పెరుగుతుండటం కృష్ణా డెల్టా పంటలను కాపాడటంలో కీలక పాత్ర పోషించబోతోంది. రెండు వైపుల నుండి జలకళ సంతరించుకోవడంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది.








