ఇంజినీరింగ్ విద్య క్రిమినల్ వేస్టా..? రేవంత్ మాటల్లో నిజమెంత?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “ఇంజినీరింగ్ క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. చేతిలో ఇంజినీరింగ్ డిగ్రీలు ఉన్నా, ఉద్యోగానికి అవసరమైన కనీస నైపుణ్యాలు ఉండటం లేదనేది ఆయన ఆవేదన. నిజానికి ఇది సత్యదూరమేమీ కాదు. కానీ, ఇక్కడే ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలు లేవని విమర్శలు వస్తుంటే, మరోవైపు యువత మాత్రం ఇప్పటికీ సాధారణ డిగ్రీల కంటే ఇంజినీరింగ్ వైపే పరుగులు తీస్తోంది. కళాశాలల యాజమాన్యాలు కూడా డిగ్రీ కాలేజీలను మూసివేసి మరిన్ని ఇంజినీరింగ్ సీట్ల కోసం అనుమతులు తెచ్చుకుంటున్నాయి. మరి ఈ గందరగోళానికి మూలం ఎక్కడుంది?
ఇంజినీరింగ్ విద్యలో లోపాలున్నాయనే విమర్శలు కొత్తవేమీ కావు. ఏటా లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా, అందులో ఉద్యోగాలకు పనికివచ్చే వారు కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమేనని పలు జాతీయ నివేదికలు చాలాకాలంగా మొత్తుకుంటున్నాయి. లోపం ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పరిశ్రమల అవసరాలకు దూరంగా పాఠ్యాంశాలు ఉంటున్నాయి. ఐటీ, కోర్ రంగాలు వేగంగా మారుతున్నప్పటికీ, మన సిలబస్ మాత్రం దశాబ్దాల నాటి పాత పద్ధతుల్లోనే మగ్గుతోంది. కాలేజీల్లో ప్రాక్టికల్ లెర్నింగ్ కంటే, కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే బట్టీ విధానానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యమైన రీసెర్చ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్న అధ్యాపకులు కొరవడటం మరో పెద్ద సమస్య.
ఇవన్నీ తెలిసినా, విద్యావ్యవస్థను మార్చడంలో ఇటు ప్రభుత్వాలు, అటు ప్రైవేట్ విద్యాసంస్థలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు విద్యను ఒక వ్యాపారంగా మార్చి సీట్లను నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటే, ప్రభుత్వాలు కేవలం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులకే పరిమితమై, విద్యలో నాణ్యతను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
ఇంజినీరింగ్ చదువు నిజంగా ‘క్రిమినల్ వేస్ట్’ కాకూడదంటే, ప్రకటనలకే పరిమితం కాకుండా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. సాంప్రదాయ సిలబస్‌ను పక్కనబెట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలకు ప్రాధాన్యమిచ్చేలా ‘స్కిల్-ఓరియంటెడ్’ కరిక్యులమ్‌ను రూపొందించాలి. ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ ఏదో ఒక పరిశ్రమతో అనుసంధానమై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్‌లు కేవలం సర్టిఫికేట్లకే పరిమితం కాకుండా, విద్యార్థులు నేరుగా ప్రాజెక్టులపై పనిచేసేలా చూడాలి. నాణ్యత లేని, కనీస ప్రాక్టికల్ ల్యాబ్‌లు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉపాధి అవకాశాలు చూపించలేని కళాశాలల సీట్లకు కోత విధించాలి.
ముఖ్యమంత్రి ఆవేదన నిజమే కావచ్చు, కానీ సమస్యను వేలెత్తి చూపడంతోనే సరిపోదు. కోట్లాది మంది యువతుల జీవితాలు, వారి తల్లిదండ్రుల కష్టార్జితం ఈ ఇంజినీరింగ్ చదువులపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి, కార్యాచరణను అమలు చేస్తేనే మన విద్యావ్యవస్థ క్రిమినల్ వేస్ట్ కాకుండా ప్రయోజనకరంగా మారుతుంది.








