నిరాయుధీకరణకు హమాస్ సిద్ధం..! ట్రంప్ కీలక ప్రకటన..!
గాజాలో శాంతి వీచిక వీయనుందా..? మూడేళ్లుగా అల్లకల్లోలమైన గాజాలో యుద్ధం ముగింపునకు అమెరికా చేస్తున్నప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రసంస్థ హమాస్.. గాజాలో సాయుధ పంధాను వీడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. హమాస్, ఇతర సాయుధ గ్రూపులు పూర్తి నిరాయుధీకరణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ బలగాలు క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ పీస్ ఒక అంగీకారానికి వచ్చిందని వెల్లడించారు.
గాజా (Gaza)లో శాంతి స్థాపన కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలినే బోర్డ్ ఆఫ్ పీస్ అంటారు. 20 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రతిపాదించగా.. అందులో ఒకటే హమాస్ నిరాయుధీకరణ. అయితే ఇంతకాలం ఆయుధాలు వదిలేసేందుకు ఆ గ్రూప్ అంగీకరించలేదు. దాంతో 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగాయి. తాజాగా ఈ గ్రూప్ అంగీకరించడంతో.. శాశ్వత శాంతి, భద్రత దిశగా చరిత్రాత్మక ముందడుగు పడిందని ట్రంప్ (Donald Trump) ట్రూత్ వేదికగా పోస్టు పెట్టారు.
తొమ్మిది నెలల క్రితం ఈ శాంతి ప్రణాళికపై సంతకాలు జరగ్గా.. హమాస్ నిరాయుధీకరణకు తాజాగా అంగీకరించింది. దీనిప్రకారం ఒప్పందం కుదిరిన 24 గంటల్లోగా బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. దీనికి బదులుగా తన వద్ద ఉన్న 250 మంది బందీలు, 1700 మంది పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. గాజాపాలనలో హమాస్ పాత్ర ఏమీ ఉండదు..తాను నిర్మించిన సొరంగాలను హమాస్ స్వయంగా ధ్వంసం చేయాలి. గాజాలో అంతర్జాతీయ పాలన ప్రారంభం అవుతుంది.అంతర్జాతీయ పాలనసమయంలో పాలస్తీనా అథారిటీ సంస్కరణలను వేగవంతం చేసి .. గాజా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది.








