పరిస్థితి అదుపు తప్పితే పెల్లెట్లు వాడే అధికారం బలగాలకు వుంది : సుప్రీం కోర్టు
దేశంలో ప్రజల నిరసనలు అదుపు తప్పినప్పుడు, హింసాత్మకంగా మారినప్పుడు వారిని నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు వుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అసాధారణ పరిస్థితుల్లో పౌరులపై పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు వుందని పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా 20 న ఢిల్లీలో విద్యార్థులు ఛలో సంసద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిని నియంత్రించేందుకు పోలీసులు పెల్లెట్ గన్స్ వాడారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పెల్లెట్స్ వాడకంపై అటు లోకసభలో, ఇటు రాజ్యసభలో రెండు చోట్లా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. అసలు ఆ అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదంటూ నిలదీశాయి. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలని రిటైర్డ్ ఐపీఎస్ యశోవర్ధన్ ఆజాద్ తో పాటు పెల్లెట్లు తగిలి, గాయపడిన వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహనతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. లాఠీఛార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగంతో కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాలను వినియోగించవచ్చని పోలీస్ నిబంధనలు చెబుతున్నాయని, అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడినప్పుడు అవసరమైతే పోలీసులు బుల్లెట్లు కూడా వినియోగిస్తున్నారు. అలాంటప్పుడు పెల్లెట్ తొపాకులపై నిషేధం ఎలా విధించగలం? అని అన్నారు.








