ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు : సీఎం రేవంత్ రెడ్డి
తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులకు పింఛన్లు
* వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు
* అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలకు…
* ప్రతి గ్రామానికి తారు రోడ్డు.. ప్రతి పంచాయతీకి భవనం
* ఆర్డబ్ల్యూఎస్, మెట్రో వాటర్, సాగు నీటి శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి
* ఇందిరమ్మ చీరలు నాణ్యతలో రాజీపడొద్దు…
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయని సీఎం తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్దన్నారు.
మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు సమావేశాలు నిర్వహించాలని, సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని తారు రోడ్డు లేని ఊరు ఉండవద్దని సీఎం అన్నారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని, ప్రతి పంచాయతీకి పంచాయతీ కార్యాలయం నిర్మించాలని సీఎం ఆదేశించారు. పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో బాధ్యత వహించేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుద్ధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్ఐఎఫ్టీ విద్యార్థులను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున, నాణ్యత, రంగుల విషయంలో ఎటువంటి రాజీపడొద్దని సీఎం సూచించారు.
ఎల్నినో నేపథ్యంలో తాగు నీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్రామీణ తాగు నీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. తాగు నీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామీణ తాగు నీటి పథకాల పరిధిలో పని చేసే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అయిదో తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. స్థానిక వనరుల ఆధారంగానే తాగు నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, పీఆర్ అండ్ ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.








