జూన్ లో పీరియడ్స్ మిస్టరీ!: వేలాది మహిళలకు ఒకే సమస్య, కారణం ఏమిటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఒకే ప్రశ్న అడిగారు.
“నా పీరియడ్ ఎప్పుడూ ఇంత లేట్ కాలేదు.”,
“ఒకే నెలలో రెండుసార్లు వచ్చింది.”,
“జూన్‌లో ఏదో విచిత్రంగా జరిగింది.”
మొదట ఇది వ్యక్తిగత సమస్య అనుకున్నారు. కానీ కొద్ది రోజుల్లో ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది మహిళలు దాదాపు ఒకే అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించారు. దేశాలు వేరు… వాతావరణాలు వేరు… లైఫ్ స్టైల్స్ వేరు…అయినా అనుభవం మాత్రం దాదాపు ఒకటే.
Reddit, TikTok, Instagram, X వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మహిళలు ఒకే విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టడంతో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ట్రెండ్‌గా కాకుండా ఒక సైన్స్ ప్రశ్నగా మారింది.
ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక బయోలాజికల్ మార్పా… మన మెదడు సృష్టించిన ఒక “కలెక్టివ్ ఇల్యూషనా”? ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించిన భ్రమా? శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా ఛేదించని ఒక బయోలాజికల్ మిస్టరీనా?
సోషల్ మీడియాను ఊపేసిన కాన్స్పిరసీ థియరీలు!
ఇలా వేలాది మంది మహిళలు తమ డిజిటల్ స్క్రీన్లపైకి వచ్చి ఒక్కసారిగా ప్రశ్నించడం మొదలయ్యేసరికి… ఇంటర్నెట్లో విచిత్రమైన ప్రచారాలు షురూ అయ్యాయి.
ఎవరో… సూర్యుడి నుంచి వచ్చిన ‘సోలార్ ఫ్లేర్స్’ (Solar Flares) వల్ల భూమిపై అయస్కాంత తరంగాలు మారి ఇలా జరిగిందన్నారు.
మరికొందరు… గ్రహాల గమనం, ఆస్ట్రాలజీ ప్రకారం ‘మాతృస్వామ్య చైతన్యం’ (Matriarchal Consciousness) పెరుగుతోందని ఊహాగానాలు చేశారు.
ఇంకొందరైతే ఏకంగా జెనీవాలోని ‘లార్జ్ హాడ్రాన్ కొలైడర్’ (LHC) ప్రయోగాలే కారణమని వ్యాఖ్యానించారు.
క్లైమేట్ చేంజ్… మన శరీరంపై చూపిస్తున్న రహస్య దాడి!
ఈ కథనం వెనుక ఉన్న అతిపెద్ద, అత్యంత తీవ్రమైన అనుమానం—ఉష్ణగాలులు (Heatwaves)! మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లో కూడా జూన్ నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. అధిక వేడి, విపరీతమైన గాలి కాలుష్యం శరీరానికి ఒక పెద్ద షాక్‌లా మారాయి. అసలు వాతావరణ మార్పులకు, మహిళల నెలసరి చక్రానికి ఏమైనా సంబంధం ఉందా?
వైద్య నిపుణుల ప్రకారం… ఖచ్చితంగా ఉంది!
సైన్స్ ఏమంటోంది?
ఇక్కడే ఈ కథ ఆసక్తికరంగా మారుతుంది. వైద్య నిపుణులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా మహిళల పీరియడ్స్‌లో ఒకేసారి మార్పు వచ్చిందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. అయితే… ఇలాంటి మార్పులు రావడం అసాధ్యం కూడా కాదని అంటున్నారు.
అలాగే శరీరం తీవ్రమైన ఉష్ణోగ్రతలకు, వాతావరణ ఒత్తిడికి గురైనప్పుడు లోపల ‘కార్టిసాల్’ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరుగుతుంది. మన మెదడు చాలా తెలివైనది. శరీరం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని గ్రహించిన వెంటనే, తన వద్ద ఉన్న శక్తిని ఆదా చేసుకునేందుకు ఆత్మరక్షణ మోడ్‌లోకి వెళ్తుంది. ఆ సమయంలో గర్భధారణ అవకాశాలను తగ్గించడానికి… పీరియడ్స్ సైకిల్‌ను తాత్కాలికంగా ఆపేయడం లేదా మార్చేయడం లాంటి పనులు చేస్తుంది!
శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురైతే, అధిక వేడి ఎదురైతే, నిద్ర దెబ్బతింటే లేదా అనారోగ్యం వచ్చినప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ తాత్కాలికంగా మారే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
అసలు పీరియడ్స్ ఎందుకు ఆలస్యం అవుతాయి?
సైన్స్ ప్రకారం పీరియడ్స్ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి.
మానసిక ఒత్తిడి
హీట్‌వేవ్స్ లేదా అధిక ఉష్ణోగ్రతలు
నిద్రలేమి
వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం
తీవ్రమైన వ్యాయామం
హార్మోన్ల అసమతుల్యత
PCOS వంటి పరిస్థితులు
థైరాయిడ్ సమస్యలు
కొన్ని మందుల ప్రభావం
ప్రయాణాలు, టైమ్‌జోన్ మార్పులు
గర్భధారణ
మన శరీరం ఎప్పుడూ ఒకేలా పనిచేయదు. కొన్నిసార్లు బయట పరిస్థితులకు అనుగుణంగా తన పని విధానాన్ని తాత్కాలికంగా మార్చుకుంటుంది.
పీరియడ్ ఆలస్యం అయితే ఏం చేయాలి?
మొదట అసలు భయపడకండి. ఒక్కసారి సైకిల్ లేట్ అవ్వడం చాలా మందిలో సహజంగా జరగొచ్చు. ముందుగా…రిలేషన్ లో ఉన్నవాళ్లు, పెళ్ళైన వాళ్లు గర్భధారణ అవకాశం ఉంటే పరీక్ష చేయించుకోవాలి. అలాగే మిగతా వాళ్లు ఇటీవల ఒత్తిడి, ప్రయాణం, నిద్రలేమి, అనారోగ్యం లాంటివి జరిగాయా అనేది గుర్తు చేసుకోవాలి. సరిపడా నీరు తాగాలి. నిద్ర సరిగ్గా తీసుకోవాలి.
అయితే…రెండు లేదా మూడు నెలల పాటు వరుసగా సైకిల్ పూర్తిగా మారిపోతే, తీవ్రమైన నొప్పి లేదా అధిక రక్తస్రావం ఉంటే గైనకాలజిస్ట్‌ను తప్పకుండా సంప్రదించాలి.
ఈ ట్రెండ్ ఎందుకు వైరల్ అయింది?
ఈ కథలో ఇదే అత్యంత ఆసక్తికరమైన అంశం. ఎపిడెమియాలజిస్టులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మనం అసాధారణ అనుభవాలనే ఎక్కువగా పంచుకుంటాం. “ఈ నెల కూడా అన్నీ సాధారణంగానే జరిగాయి” అని ఎవరూ పోస్ట్ పెట్టరు. కానీ… “నా పీరియడ్ ఎప్పుడూ ఇలా కాలేదు” అనే పోస్టు మాత్రం వేల మందిని ఆకర్షిస్తుంది. ఆ తర్వాత అదే అనుభవం ఉన్నవాళ్లు వరుసగా స్పందించడం మొదలుపెడతారు. అప్పుడు నిజంగా ఎంతమందికి సమస్య వచ్చింది… సోషల్ మీడియా వల్ల ఎంత పెద్దగా కనిపించింది… అనే తేడాను గుర్తించడం చాలా కష్టం.
ఈ ట్రెండ్ వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా?
ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ఉంది. కొన్ని పీరియడ్ ట్రాకింగ్ యాప్‌లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు కూడా… “జూన్‌లో మీ పీరియడ్స్ మారాయా?” అంటూ వీడియోలు, పోల్స్, పోస్టులు చేశాయి. దీంతో కొందరు… ఈ చర్చను పీరియడ్ ట్రాకింగ్ యాప్‌ల మార్కెటింగ్ మరింత పెంచిందా అనే ప్రశ్న కూడా లేవనెత్తారు.అయితే…ఇది ఉద్దేశపూర్వక మార్కెటింగ్ అని చెప్పే ఆధారాలు ప్రస్తుతం లేవు.
కానీ సోషల్ మీడియా అల్గారిథమ్‌లు, వైరల్ పోస్టులు, ట్రెండింగ్ వీడియోలు కలిసి ఈ చర్చను ప్రపంచవ్యాప్త అంశంగా మార్చాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏదైమైనా
క్లైమేట్ చేంజ్ గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా భూమి, పంటలు, సముద్రాలు, ఉష్ణోగ్రతల కోణంలోనే మాట్లాడతాం. ఇప్పుడు అదే మార్పులు మన శరీరాలపై, ముఖ్యంగా మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. బహుశా…అదే జూన్‌లో వైరల్ అయిన ఈ కథ అసలు సమాధానం కంటే కొత్త ప్రశ్నలను ఎక్కువగా మిగిల్చింది. అదే ఈ కథను ఒక సాధారణ సోషల్ మీడియా ట్రెండ్ నుంచి సైన్స్ మిస్టరీగా మార్చింది.








