ఆటా మహాసభల్లో తెలుగు సైనికులకు సన్మానం
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఆటా 19వ మహాసభల రెండో రోజు వేడుకలు సందడిగా సాగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. ఈ వేడుకలలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ మిలిటరీలో సేవలందిస్తున్న తెలుగు సైనికులను వేదికపై ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అమెరికన్ ఆర్మీలో సేవలు అందిస్తున్న తెలుగు వీరులను చూస్తుంటే, ధైర్యంలో కూడా తెలుగువాళ్ళ సత్తా కనిపిస్తోందని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ సైనికులను గుర్తించి గౌరవించడం తమకు గర్వకారణంగా ఉందని ఆటా నాయకులు పేర్కొన్నారు.
మేజర్ శాంతన్ రెడ్డి తూడి గత 15 ఏళ్లకు పైగా లాజిస్టిక్స్ మరియు సిబిఆర్ ఎన్ విభాగంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో సేవలందించారు, లెఫ్టినెంట్ కర్నల్ మధుసూధన్ కాసపల్లి డెంటల్ కోర్లో 16 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఫస్ట్ లెఫ్టినెంట్ కౌటిల్య నలుబోలు ఆర్మీలో 10 ఏళ్లకు పైగా సేవలందించారు. స్టాఫ్ సర్జెంట్ వెంకటేష్ బాలిన కాంబాట్ ఇంజనీరింగ్ కమాండ్‌లో సేవలు అందించారు. సర్జెంట్ శివప్రసాద్ ప్రసాదం చినుక్ మెకానిక్‌గా 10 ఏళ్ళుగా సేవలందిస్తున్నారు. సర్జ్జెంట్ వివేక్ పోతుమంచి, స్పెషలిస్ట్ వినీత్ రెడ్డి అమరం, స్పెషలిస్ట్ గుల్లపల్లి, స్పెషలిస్ట్ కీర్తి గనగం, స్పెషలిస్ట్ ప్రశాంత్ రెడ్డి బైరి, హారికా కోసో, స్పెషలిస్ట్ దేవి ప్రసాద్ కొత్తూరు, స్పెషలిస్ట్ చైతన్య చర్లపల్లి, స్పెషలిస్ట్ జయంత్ ఇనుగాల తదితరులను సన్మానించారు.








