చైనా జాబ్ మార్కెట్ పై ఏఐ పంజా..!
ఏఐలో అగ్రభాగాన ఉన్న చైనా.. దాన్ని మరింతగా వేగంగా విస్తరిస్తోంది. పలు రంగాల్లో ఏఐను ప్రవేశపెడుతోంది. అయితే ఈ పరిణామం చూసేందుకు అభివృద్ధికి ఊతమిచ్చేలా కనిపిస్తున్నా.. దాని ఫలితాలు మాత్రం నిరుద్యోగితను భారీగా పెంచుతున్నాయి. ఫలితంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఇది చైనా జాబ్ మార్కెట్ ను భయంలో ముంచెత్తుతోంది.
వుహాన్ నగరంలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడంతో చాలా మంది ట్యాక్సీ డ్రైవర్లు ఒక్కసారిగా తమ ఉపాధిని కోల్పోయారు. అయితే, ఆ తర్వాత కొన్ని డ్రైవర్‌లెస్ కార్లు ఆకస్మికంగా రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లకు కారణమవడంతో, వాటిని పరిశీలన కోసం తాత్కాలికంగా ఉపసంహరించారు. దీంతో డ్రైవర్లు మళ్లీ విధుల్లో చేరారు. ఈ ఘటన ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పును కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇది కేవలం డ్రైవర్లకే పరిమితం కాలేదు. ఏఐని ప్రవేశపెట్టడం కోసం వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించిన సంస్థలు, కోర్టు తీర్పుల ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.
చైనాలో ఇప్పటికే నిరుద్యోగం అధిక స్థాయిలో ఉండగా, రియల్ ఎస్టేట్, విద్య వంటి రంగాలు మాంద్యంలోకి జారుకోవడంతో కోట్లాది మంది ఫార్మల్ ఉద్యోగాలను వదిలి గిగ్ ఎకానమీ (తాత్కాలిక పనులు) వైపు మళ్లుతున్నారు. ఒక థింక్‌ట్యాంక్ అంచనా ప్రకారం, 2019లో 160 మిలియన్లుగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య, ఈ ఏడాదికి 320 మిలియన్లకు (సుమారు 44 శాతం కార్మిక శక్తి) పెరుగుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రైడ్-హెయిలింగ్ యాప్‌లపై ఆధారపడిన వారి ఉపాధికి ఇప్పుడు రోబోట్యాక్సీల రూపంలో గండి పడుతోంది.
ఈ సమస్య సృజనాత్మక రంగాలనూ వదలడం లేదు. బీజింగ్‌లో 20 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ టియాన్ జెమిన్, తన ఉద్యోగాన్ని ఏఐ సాఫ్ట్వేర్ వల్ల కోల్పోయారు. “ఆరేళ్ల కఠోర శ్రమ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగితే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ నా స్థానాన్ని భర్తీ చేసింది” అని ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
గత జులైలో జరిగిన ప్రపంచ ఏఐ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ… ఏఐ అనేది అందరి శ్రేయస్సు, భద్రతకు చోదకశక్తిగా ఉండాలని ఆకాంక్షించారు.








