అమెరికా, కెనడాల్లో కార్చిచ్చు.. లక్షల ఎకరాల్లో అడవులు బూడిద..!
అమెరికా, కెనడాల్లో కార్చిచ్చు విజృంభిస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో అగ్నికీలలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మంటల వల్ల 4,50,000 ఎకరాలు బూడిదయ్యాయి. అవి సమీప నగరాలకు కూడా వ్యాపిస్తుండడంతో.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి నాలుగు వేల మంది అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. తూర్పు వాషింగ్టన్లో సుమారు 2,30,000 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మూడు వేల ఎకరాల్లో అగ్నికీలలు చురుగ్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బలమైన గాలులు వీస్తుండడం వల్ల మంటలు అదుపు చేయడం సవాలుగా మారింది.
అగ్నికీలలు క్రమంగా వ్యాపిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. వాషింగ్టన్లోని సుమారు 4 వేల నివాసాలకు ముప్పు పొంచి ఉందన్నారు. స్పోకేన్ ప్రాంతంలో మంటలు విస్తరిస్తుండడంతో.. 200 ఇళ్లు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులను ఖాళీ చేయించినట్లు మేయర్ లిసా బ్రౌన్ తెలిపారు. 5 కోట్ల మందికి పైగా అమెరికన్లపై కార్చిచ్చు (Wildfire) ప్రభావం ఉంటుందన్నారు.
అగ్నికీలలు వేగంగా విస్తరిస్తుండడంతో.. తూర్పు వాషింగ్టన్ సహా పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) జాతీయ వాతావరణ కేంద్రం(PT) రెడ్ ఫ్లాగ్ హెచ్చరికను జారీ చేసింది.








