అట్టహాసంగా ప్రారంభమైన సిలికానాంధ్ర రజతోత్సవాలు.. తెలుగు సంస్కృతికి పెద్దపీట!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ ఎరీనా వేదికగా ‘సిలికానాంధ్ర’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు భాషా పరిరక్షణకు, సంస్కృతీసంప్రదాయాల వికాసానికి గత 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ, తన పాతికేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే కుటుంబంగా అనుసంధానిస్తూ, భావితరాలకు మన సంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా
ఈ మహాసభలు సాగుతున్నాయి.
ఈ వేడుకల్లో భాగంగా తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కుంభ హారతి, సంగీత, లయ సవ్వడులు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు, లలిత గీతాలు, శతక పద్యాల ఆలాపన , జానపద కళారూపాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా ఈ వేదికపై ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సంగీతామృత వర్షిణి, లయామృత వర్షిణి టీమ్స్ ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రదర్శన జరిగింది. అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రవాస తెలుగువారితో ఈ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.








