సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం
(చెన్నూరి వెంకట సుబ్బారావు)
తెలుగు భాష, సంస్కృతికి పట్టం కడుతూ 2001లో ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని వేడుకలు జరుపుకుంటున్న సిలికానాంధ్ర నేడు 31 జులై 20 26న సాయంత్రం బాంక్వెట్ డిన్నర్ తో వేడుకలను అట్టహాసంగా, అంగరంగ వైభవంగా ప్రారంభించింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాల స్ఫూర్తిని అందిస్తున్న సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవ వేడుకలను అదే విధంగా నిర్వహిస్తూ తన విభిన్నతను మరోసారి చాటుకుంది. ఒకవైపు ఆ వేడుకకు పచ్చని తోరణాలుగా స్ఫూర్తినిచ్చిన గురువరేణ్యలకు, మహా దాతలకు సత్కారాలు! ఇంకో వైపు వచ్చినవారికి అరటి ఆకులో అచ్చమైన సాంప్రదాయ తెలుగు వారి విందు వైభవాన్ని కలిగించి వేడుకలను నిర్వహించడంలో సిలికానాంధ్ర భిన్నంగా ఉంటుందని మరోసారి చాటిచెప్పింది. వచ్చిన అతిధులను, గురువులను సత్కరించే శాలువాలను కూడా భిన్నమైన రూపంలో, రంగులో తయారు చేయించి అందులో కూడా తన విభిన్నతను సిలికానాంధ్ర చాటుకుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి అతి పురాతన కాడ ఒగ్గు కథ చెప్పడానికి మిద్దె రాములుగారి మనవడు మిద్దె పరశురామ్ అమెరికా కు వచ్చి బృందంతో ఒగ్గు కథ చెప్పారు. అమెరికాలో వివిధ నగరాల్లో నివసిస్తూ శాస్త్రీయ నాట్యం, సంగీతం నేర్పిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురువులను ఈ సందర్భంగా సత్కరించడం విశేషం.
![]()


సిలికానాంధ్ర వ్యవస్థాపక వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి మాట్లాడుతూ 120 మందితో రేపు సాయత్రం దక్ష యజ్ఞం నాటిక ప్రదర్శిస్తున్నామని, అరీనా లో (అంటే క్రీడారంగంలో లాగా మధ్యలో ప్రదర్శన జరుగుతూ ఉంటే నాలుగు వైపులా ప్రేక్షకులు కూర్చుని చూస్తారు) లో ప్రదర్శన ఇదే మొదటి సారి అని చెప్పారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపకులు డాక్టర్ ఆనంద్ కూచిభోట్ల స్వయంగా ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ ఈ వేడుకకు పిల్లర్స్ గా నిలిచిన దాతలను వారి కుటుంబాలను సత్కరించుకున్నారు. ఈ రజతోత్సవ వేడుకల్లో వివిధ కళా ప్రదర్శనలకు గురువులుగా నిలిచిన ప్రముఖ గురువులను సిలికానాంధ్ర అధ్యక్షురాలు ప్రియ తనుగుల ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ వేడుకలకు అతిదులుగా బిజెపి సీనియర్ నేత కె. మురళీధరరావు, అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి, పూర్వ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ పూర్వ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ కవి, రచయిత జొన్నవిత్తుల తదితరులు హాజరయ్యారు.
సంప్రదాయ అరిటాకు భోజనం
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ సంస్థలు ఆర్భాటంగా వేడుకలను నిర్వహిస్తూ, తొలిరోజు బాంక్వెట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంటాయి. అంటే ఆ వేడుకల్లో పాల్గొనే అతిధులను, దాతలను సత్కరించుకునే ముందస్తు కార్యక్రమమే బాంక్వెట్ డిన్నర్. కాగా ఈ డిన్నర్ లో బఫే భోజనమే మనకు కనిపిస్తుంటుంది. అందరూ చేతిలో ప్లేట్స్ పెట్టుకుని వడ్డించేవాడి దగ్గరకు వెళ్ళి తమకు కావాల్సినవి వేసుకుంటారు. కాని సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ వేడుకల్లో జరిగిన బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం అచ్చ తెలుగు విందు భోజనాన్ని తలపించింది. వేడివేడి పకోడీలతోపాటు షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వచ్చినవారిని కూర్చోపెట్టి అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం విశేషంగా చెప్పవచ్చు. ఏదీ ఏమైనా వేలాదిమందికి చక్కగా అరిటాకు భోజనం పెట్టి తెలుగువారి స్వాగత సత్కారాలకు చిరునామాగా మరోసారి సిలికానాంధ్ర నిరూపించుకుంది.








