నన్ను అరెస్ట్ చేస్తారా..? న్యూయార్క్ గవర్నర్ పై బీబీ ఫైర్..!
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వస్తే.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) వారంట్‌పై ఆయనను అరెస్ట్ చేయాలన్న న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యలపై బీబీ ఘాటుగా స్పందించారు. తనను ఎవరైనా అరెస్ట్ చేస్తే.. ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. యూదులలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే మమ్దానీ తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీసీ ఓ అవినీతిమయమైన సంస్థ అని.. అది తనపై నకిలీ వారంట్‌ను జారీ చేసిందని కొట్టిపడేశారు. భవిష్యత్తులో తమ నేతలు, సైన్యంపై కూడా కేసులు పెడుతుందని దుయ్యబట్టారు.
నెతన్యాహు త్వరలో అమెరికా (USA) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మమ్దానీ మాట్లాడుతూ.. నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. పాలస్తీనియన్లను పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనతో గాజా, లెబనాన్‌లపై సైనిక చర్య కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అయితే ఓ దేశ ప్రధాని స్థానంలో ఉన్న ఆయనను అరెస్టు చేయడానికి న్యూయార్క్ నగర అధికారులకు చట్టపరమైన అధికారం లేదన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన సమయంలో నెతన్యాహును అరెస్ట్ చేయాలని ట్రంప్ యంత్రాంగాన్ని కోరారు. ఆయన అభ్యర్థనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. నెతన్యాహును తాము అరెస్ట్ చేయబోమని స్పష్టం చేశారు.
గాజాపై యుద్ధం (Israel Gaza War) నేపథ్యంలో నెతన్యాహు (Israel PM Netanyahu), ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌పై 2024 నవంబరులో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్యదేశాల్లోకి అడుగుపెడితే వీరిని అరెస్టు చేసే ముప్పు పొంచి ఉంది. ఈకారణంతో ఐసీసీ సభ్య దేశాల్లో పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని వెనకాడుతున్నారు. అయితే మిత్రపక్షం అమెరికా నుంచే ఇలాంటి ప్రకటన రావడాన్ని తీవ్రంగా తీసుకున్న నెతన్యాహు.. ఈ హెచ్చరికలు చేశారు.








