మాతృ భూమిని మర్చిపోవద్దు.. ఆటా మహాసభల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ వేడుకలకు విచ్చేసిన ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కార్యదర్శి శ్రీధర్ బానాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామసహాయం, సురేశ్ రెడ్డితో పాటు అమెరికా , ఇతర దేశాల నుండి తరలివచ్చిన ప్రతినిధులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను విస్తరింపజేయడంలో ఆటా ప్రధాన భూమిక పోషిస్తోందని ఆయన కొనియాడారు.
ప్రభుత్వ సహకారం..
అమెరికాలో ఉన్నత స్థానాల్లో స్థిరపడినప్పటికీ, జన్మనిచ్చిన మాతృభూమి అయిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎప్పటికీ మర్చిపోకూడదని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సిఉండి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన తరఫున శాసనమండలి చైర్మన్గా తాను, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు హాజరయ్యామని తెలిపారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ వేడుకలకు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం తరఫున ఇక్కడ ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా, సమస్యలు ఉన్నా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నారైల సేవలు మాతృభూమి అభివృద్ధికి కూడా ఎల్లవేళలా ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.








