తెలుగు వెలుగుల పండుగే ఆటా వేడుకలు: శరత్ వేముల
అమెరికాలో 35 వసంతాలు పూర్తి చేసుకున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరుగుతున్న 19వ ఆటా మహాసభలకు నేషనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు శరత్ వేముల తెలిపారు. ఈ మహాసభలు కేవలం కొన్ని గంటల కార్యక్రమం కాదని, మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే అద్భుతమైన తెలుగు వెలుగుల పండగ అని ఆయన అభివర్ణించారు. శ్రీకృష్ణదేవరాయులు అముక్తమాల్యదలో పేర్కొన్న “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నానుడిని గుర్తుచేస్తూ, మన మాతృభాష గొప్పదనాన్ని, పూర్వ వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన అన్నారు
అమెరికా గడ్డపై తెలుగు వారి అస్తిత్వాన్ని చాటే ఈ మహాసభల కోసం కోర్ టీమ్ గత కొన్ని నెలలుగా అహర్నిశలు శ్రమించి ఏర్పాట్లు పూర్తి చేసిందని శరత్ వేముల తెలిపారు. ఈ సభలకు అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెనడా, యూరప్ , మిడిల్ ఈస్ట్ దేశాల నుండి సుమారు 12,000 మంది ప్రతినిధులు తరలివస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సాహితీవేత్తలతో పాటు, మేరీల్యాండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ , బాల్టిమోర్ మేయర్ కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కానున్నారని తెలిపారు.
ఈ మహాసభలలో పూర్వ విద్యార్థుల సమావేశాలు, “జుమ్మంది నాదం – సయ్యంది పాదం” పేరుతో అద్భుతమైన నృత్య సంగీత ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, ఉమెన్స్ ఫోరం , బిజినెస్ ఫోరం వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని 19వ మహాసభలను దిగ్విజయంగా విజయవంతం చేయాలని శరత్ వేముల కోరారు.








