ప్రధానిపై మాట పడితే అది మాపై పడినట్టే: పవన్ కళ్యాణ్
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న నిరసనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సభాముఖంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram Airport) ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై జరిగిన అభ్యంతరకర కామెంట్స్ తనను ఎంతగానో కలచివేసాయన్నారు. ఈ వ్యవహారంపై ఈ రోజు భోగాపురం వేదికగా ఆ మతోన్మాద, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
“భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మహోన్నత నాయకుడికి మనం ఇచ్చే మర్యాద ఇదేనా? జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కొందరు అనకూడని మాటలు అంటుంటే ఆ వీడియోలు చూసి నా మనసు వికలమైంది. ఆ అవాకులు చవాకులు వింటుంటే నాకు తీవ్రమైన బాధ కలుగుతోంది” అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంక్షేమం కోసం, 140 కోట్ల మంది భారతీయుల ఆశయాల కోసం మోదీ పడుతున్న కష్టం సామాన్యమైనది కాదని కొనియాడారు.
అయితే ఆయన చేస్తున్న త్యాగాలు మరియు కష్టం నేటి కొత్త తరానికి సరిగ్గా అర్థం కావడం లేదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే శక్తులకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎలాంటి నిందలు వేసినా, ఏ ఒక్క చిన్న మాట అన్నా.. అది దేశం కోసం పనిచేస్తున్న మా అందరి మీద పడినట్టే భావిస్తాం. ప్రస్తుతం దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో మోదీని మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరు, భవిష్యత్తులో రారు కూడా” అంటూ ఆయన స్పష్టం చేశారు.








