హర్మూజ్ పై ఆధిపత్యపోరు.. వాణిజ్యనౌకలపై దాడులు వద్దన్న భారత్..!
పశ్చిమాసియా సంక్షోభం రానురాను మరింత తీవ్రమవుతోంది. ఎలాగైనా ఇరాన్ మెడలు వంచి తాము చెప్పిన షరతులకు అంగీకరింపజేయాలన్న పట్టుదల ట్రంప్ లో కనిపిస్తోంది. అందుకే కఠినషరతులు విధిస్తూ.. ట్రంప్ ముందుకెళ్తున్నారు. మరోవైపు.. ఇరాన్ సైతం తాను పాడిన పాటనే పాడుతోంది. హర్మూజ్ పై పెత్తనం తనకే కావాలంటోంది. దీంతో ఇరు పక్షాల మధ్య దాడుల పర్వం కొనసాగుతోంది. అవసరమైతే యుద్ధం కొనసాగిస్తాం తప్ప, ఆధిపత్యం వదులుకోమంటోంది ఇరాన్.
హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ (Iran) ప్రకటించగా.. ప్రపంచ వాణిజ్యానికి హర్మూజ్ తెరిచే ఉందని అమెరికా (USA) చెబుతోంది. ఈ క్రమంలో యూఎస్ మద్దతుతో హర్మూజ్ దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకల్ని అడ్డుకున్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. ఈ ఘటన తర్వాత మరో నాలుగు నౌకలు తిరుగుముఖం పట్టాయని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధికార మీడియా ప్రెస్ టీవీ పేర్కొంది.తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హర్మూజ్ మూసే ఉంటుందని ఈ సందర్భంగా ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్ నేవీ అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇటీవల హర్మూజ్ లో వాణిజ్య నౌకలపై దాడులు పెరిగిపోతన్నాయి. ముఖ్యంగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో పలువురు భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
‘‘ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్య నౌకలు, నావికులపై దాడులు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశాను. ఇటువంటి దాడులను ఏ పక్షం చేసినా భారత్ ఖండిస్తుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిణామాలు, జరుగుతున్న చర్చల వివరాలను ఇరాన్ తెలియజేసింది. సంప్రదింపులు, దౌత్యానికే భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది’’ అని జైశంకర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.t








