50 దేశాలపై అమెరికా వీసా బాండ్ బాంబ్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 50 దేశాలపై వీసా బాండ్ బాంబ్ వేశారు. బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటకం) వీసాల జారీకి శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది ట్రంప్ సర్కార్ (Visa bond program). దీనికింద ఆ దేశాల పర్యాటకులు 20 వేల డాలర్ల బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. యూఎస్ వీసా బాండ్ ప్రోగ్రామ్ తొలుత పైలట్ కార్యక్రమంగా ప్రారంభమైంది. ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం దీనికి కొన్ని మార్పులు చేసి, విస్తృత స్థాయిలో అమల్లోకి తీసుకువస్తోంది.కొత్త నిబంధనలు ఆగస్టు 3, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి
50 నిర్దేశిత దేశాల నుంచి వ్యాపారం, పర్యాటకం వంటి తాత్కాలిక పనుల కోసం వచ్చే సందర్శకులు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. . ఈ ప్రోగ్రామ్ వల్ల వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు గుర్తించారు. దీంతో దీనిని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ప్రకారం.. పైలట్ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేసిన దరఖాస్తుదారులు బాండ్ రూపంలో డిపాజిట్ చేసే మొత్తం 5000 డాలర్లు, 10 వేల డాలర్లు, గరిష్ఠ మొత్తం 15 వేల డాలర్లుగా ఉంది. తుది నిబంధనల్లో 5000 డాలర్ల ఆప్షన్‌ను తొలగించారు. గరిష్ఠ మొత్తాన్ని 20వేల డాలర్లకు పెంచారు.
వీసా ఓవర్‌స్టే రేటు ఎక్కువగా ఉన్న 50 దేశాల పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయి. భారత్ పేరు ఈ జాబితాలో లేకపోవడం కాస్త ఊరటనిస్తోంది.








