ఆటా మహాసభల్లో ఆకట్టుకున్న బుర్రకథ ప్రదర్శన..
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో భాగంగా, భారతీయ సంప్రదాయ జానపద కళ అయిన ‘బుర్రకథ’ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీదేవి కళా సమితికి చెందిన బుర్రకథ కళాబృందం ఈ వేదికపై ప్రదర్శించిన అద్భుతమైన కళారూపం ప్రవాస తెలుగువారిని ఎంతగానో అలరించింది.
ప్రదర్శన విశేషాలు…
మన సంస్కృతి, సంప్రదాయాలు , జానపద కళల గొప్పతనాన్ని అమెరికా గడ్డపై ఉన్న భావితరాలకు పరిచయం చేసే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణాలర్పించిన మహావీరులను స్మరించుకుంటూ ప్రదర్శన ప్రారంభమైంది. మన్యం ప్రజల విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో అత్యంత అద్భుతంగా ఆలపించారు.
బాస్టియన్ కాలంలో గిరిజనులు ఎదుర్కొన్న కష్టాలు, మన్యంలో రోడ్ల నిర్మాణం సమయంలో కార్మికుల కష్టాలను తెలుపుతూ సాగిన పల్లె పాటలు , జానపద గేయాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ మన అచ్చమైన జానపద కళలను ఆదరిస్తూ, తెలుగువారి అస్తిత్వాన్ని చాటిచెబుతున్న ఆటా నిర్వాహకులకు కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు.








