సిలికానాంధ్ర రజతోత్సవాలు… గిన్నీస్ రికార్డు సృష్టించిన లయామృతవర్షిణి
(ఓక్ లాండ్ ఎరీనా నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)
సిలికానాంధ్ర తన 25 సంవత్సరాలు వేడుకను విభిన్నంగా చేయడంతోపాటు గిన్నిస్ రికార్డులను సృష్టించడం విశేషం. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆనంద కూచిభొట్ల, ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియ తనుగులతోపాటు సిలికానాంధ్ర టీమ్, వలంటీర్లు ఎంతో శ్రమించి ఈ వేడుకను అద్భుతంగా దిగ్విజయం చేశారు. సిలికానాంధ్ర రజతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన లయామృత వర్షిణి కార్యక్రమం కూడా గిన్నిస్ రికార్డును సాధించింది.
గతంలోనే సిలికాన్ ఆంధ్ర శాస్త్రీయ నృత్యం కూచిపూడి మీద, శాస్త్రీయ సంగీతం అన్నమయ్య కీర్తనల మీద గిన్నీస్ రికార్డ్స్ పొంది ఉన్నారు. అందుకని ఈసారి శాస్త్రీయ సంగీతంలో ముఖ్యపాత్ర వహిస్తున్న మృదంగం, వీణ, ఫ్లూట్ లాంటి వాయిద్యాల తో రికార్డు చేయాలనుకొని చేసిన కార్యక్రమమే లయామృత వర్షిణి. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ మృదంగ విద్వాన్ లు అమెరికాలో ఈ వాయిద్య సంగీతాలన్నీ నేర్చుకుంటున్న శిష్యులు, నేర్పుతున్న గురువులు అందర్నీ ఒకచోటకి చేర్చి వారందరి చేత దాదాపు 15 నిమిషాలు లయబద్ధంగా ఆ వాయిద్యాలు వాయిస్ తో చేసిన ప్రయత్నమే లయామృత వర్షిణి. ఈసారి కూడా గిన్నిస్ బుక్ అధికారి మిస్టర్ మైఖేల్ స్టేజ్ మీదకు వచ్చి 296 మంది లయబద్ధంగా సంగీత వాయిద్యాలు చేశారని ఇది ఒక రికార్డుగా ఒప్పుకుంటున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్లకు, ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియ తనుగులకు అందజేశారు.








