40 ఏళ్ళ క్రితం 7గురు సభ్యులతో…నేడు 4వేలమందితో పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గురుపూర్ణిమ వేడుకలు
సరిగ్గా 40 ఏళ్ల క్రితం, 1986 వ సంవత్సరంలో పెన్సిల్వేనియాలోని ఒక చిన్న గ్రామంలో కేవలం ఇద్దరు పరివార సభ్యులు, ఐదుగురు అదృష్టవంతులైన భక్తుల సమక్షంలో అత్యల్పంగా శ్రీ స్వామీజీ గురుపూర్ణిమ వేడుకలు జరిగాయి. కానీ, నేడు నాలుగు దశాబ్దాల తర్వాత, టెక్సాస్‌లోని డల్లాస్ నగరం నడిబొడ్డున ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో 4,000 మందికి పైగా భక్తుల జయ జయధ్వానాల నడుమ గురుపూర్ణిమ మహోత్సవాలు అత్యంత శోభాయమానంగా జరిగాయి. పూజ్య శ్రీ స్వామీజీ దివ్య సంకల్పం, దూరదృష్టి నిజంగా అద్భుతం, అమోఘమని భక్తులు కొనియాడారు.
డల్లాస్ లోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయానికి పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఘనంగా శోభాయాత్రతో వేంచేశారు. ముందుగా శ్రీ స్వామీజీ ఆలయంలోని దేవతా మూర్తులను దర్శించుకుని మహా మంగళ హారతి సమర్పించారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో గురుగీతను పఠిస్తుండగా శ్రీ స్వామీజీ పవిత్ర శ్రీచక్ర పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ్య శ్రీ స్వామీజీకి భక్తులు “పంచాశత్ నదీ జల పాదాభిషేకం” అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని దివ్య పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో పాటు, అమెరికాలోని 50 నదుల నుంచి తెచ్చిన జలాలతో శ్రీ స్వామీజీ పాదాలకు ఈ అభిషేకం గావించారు. అనంతరం శ్రీ స్వామీజీకి అష్టోత్తర పూజ మరియు మంగళ హారతులు అర్పించారు.

ఈ పావన సందర్భంలో శ్రీ స్వామీజీ “స్వర్ణ యాత్ర సంస్కరణల పుస్తకాన్ని” ఆవిష్కరించారు. అలాగే ‘దత్త వేణు 1’, ‘ఎస్.జి.ఎస్ హంస త్రియోగ’, ‘నాద యాత్ర’, మరియు ‘స్వర్ణ యాత్ర నామ సంకీర్తన’ అనే నాలుగు నూతన సంగీత ఆల్బమ్‌లను విడుదల చేశారు. ఆలయ ధర్మకర్తలు (ట్రస్టీలు) శ్రీ స్వామీజీకి ఘనంగా గజమాల అర్పించి తమ భక్తిని చాటుకున్నారు. వీటితో పాటు, నూతనంగా నిర్మించనున్న ‘బాల దత్త తరగతి గదులు’ మరియు ‘దేవాలయ కోనేరు (తటాకం)’ డిజైన్ ప్లాన్లను శ్రీ స్వామీజీ ఆవిష్కరించారు.
అనంతరం శ్రీ స్వామీజీ భక్తులకు పవిత్ర గురుపూర్ణిమ అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ స్వామీజీ తమ అపారమైన దయా దాక్షిణ్యాలతో ఈ దివ్య దినాన ప్రతి ఒక్క భక్తునికి వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ దర్శన రేఖ (క్యు లైన్) సాయంత్రం వరకు దాదాపు ఏడు గంటలకు పైగా నిరంతరాయంగా కొనసాగింది.
ఈ గురుపూర్ణిమ మహోత్సవాలు పండిట్ శ్రీ రాకేష్ చౌరాసియా గారి మనోహరమైన వేణుగానం (మురళీ గానం), పండిట్ శ్రీ అమిత్ కవ్ఠేకర్ గారి తబలా సహకారంతో సాగిన ఘన సంగీత కచేరీతో అత్యంత వైభవంగా ముగిసాయి.








