సిలికానాంధ్ర రజతోత్సవాలు… గిన్నీస్ రికార్డు సృష్టించిన సంగీతామృతవర్షిణి
(ఓక్ లాండ్ ఎరీనా నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)
సిలికానాంధ్ర అంటే తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల వేదిక అని గత 25 ఏళ్లుగా వారు చేసిన పనులన్నీ చెబుతూనే ఉన్నాయి. అలాంటి సిలికానాంధ్ర అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంఘాల కంటే భిన్నంగా తన 25 సంవత్సరాలు వేడుక ఏ విధంగా చేస్తుంది అని చాలామంది ఎదురుచూశారు కూడా. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆనంద కూచిభోట్ల కూడా సిలికానాంధ్ర విభిన్నతను చాటేలా రజతోత్సవాలను నిర్వహించడంతోపాటు గిన్నిస్ రికార్డుల్లో కూడా ఈ రజతోత్సవాలు ఎక్కేలా చేశారు. 3 గిన్నిస్ రికార్డులను ఈ రజతోత్సవ వేడుకల్లో సాధించడం విశేషం.
సంగీతామృత వర్షిణి..
14వ శతాబ్దం నాటి తెలుగు వాగ్గేయకారులు అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులతోపాటు బాల మురళీకృష్ణ లు రచించిన లేదా రచించి పాడిన, లేదా పాడిన స్వరాలను అమెరికాలోని శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు, పెద్దవాళ్ళందరినీ కలిపి ఒకచోట చేర్చి వారి చేత ఈ పాటలను పాడించాలన్న ఆలోచన నుంచి పుట్టింది సంగీతామృత వర్షిణి.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వచ్చిన అధికారి మిస్టర్ మైకేల్ , ఆయన బృందం ఓక్లాండ్ ఎరీనా లో లైన్ లైన్ తిరుగుతూ మనిషి మనిషిని కౌంట్ చేసుకుంటూ ఉండటం ప్రత్యక్షంగా కనిపించింది. ఫైనల్ గా 996 మంది శాస్త్రీయ సంగీత గాయకులు కలిసి సంగీతామృతాన్ని కురిపించారు. ఆ తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మైఖేల్ స్టేజ్ మీదకు వచ్చి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓక్లాండ్ స్టేడియంలో 996 మంది కలిసి ఈ విధంగా ఒకేసారి పాడటం ఒక రికార్డుగా డిక్లేర్ చేశారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్లకు, ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియ తనుగులకు అందజేశారు.
పాల్గొన్న సంగీత దిగ్గజాలు…
భారతదేశం నుంచి ప్రఖ్యాత సంగీత దిగ్గజాలు ఈ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన విద్వాంసులు, సంగీత కళానిధి డాక్టర్ త్రిచి శంకరన్, ప్రఖ్యాత కర్ణాటక గాయకుడు, కంపోజర్, ఆర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ విద్వాన్ కేఎన్ శశికిరణ్, మృదంగ నాదమణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత విద్వాన్ పత్రి సతీష్ కుమార్, కర్ణాటక సంగీత దిగ్గజం, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ‘కళైమామణి’ తిరువారూర్ వైద్యనాథన్, ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విదుషి సుధా రఘునాథన్తోపాటు యువ గాయనీ గాయకులు ఎందరో ఇందులో పాల్గొన్నారు.








