హైదరాబాద్‌తో నాకున్న అనుబంధం మరువలేనిది: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హాష్మి
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్‌లో వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హాష్మి ప్రత్యేక అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమెను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, నిర్వాహకులు ఘనంగా ఆహ్వానించారు.
ఈ వేడుకల్లో మాట్లాడిన గజాలా హాష్మి తాను పుట్టి పెరిగిన హైదరాబాద్ నగరంతో తనకున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో తన తాత ఇల్లు ఉండేదని, చిన్నతనంలో చార్మినార్, లాడ్ బజార్లను సందర్శించడం, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హైదరాబాది బిర్యానీని ఆస్వాదించడం తనకు ఎప్పటికీ గుర్తున్నాయని ఆమె తెలిపారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు రైళ్లలో ప్రయాణించిన మధుర క్షణాలను ఆమె గుర్తుచేసుకుంటూ, ఇక్కడకు రావడం సొంత కుటుంబం మధ్యలోకి వచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
వర్జీనియా చరిత్రలో అత్యున్నత పదవిని అధిరోహించిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా తాను నిలిచానని గజాలా హాష్మి తెలిపారు. సరిగ్గా ఇదే మేరీల్యాండ్ రాష్ట్రంలో కూడా దక్షిణాసియా మూలాలు ఉన్న మరో మహిళ అరుణా మిల్లర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారని, తామిద్దరం ఒకే సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించడం విశేషమని పేర్కొన్నారు.
అమెరికాలో ప్రవాస తెలుగువారందరూ వ్యాపారాలు, ఉద్యోగాలు, విద్య, వైద్య రంగాలలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజంలో మన అడుగులు గట్టిగా ఉండాలని, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ రాజకీయంగా, పౌరులుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో తనను ఘనంగా సత్కరించిన ఆటా నిర్వాహకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








