హైదరాబాద్లో రూ.20 కోట్లతో ఎన్ఆర్ఐ భవన్.. ఆటా వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న 19వ మహాసభల రెండో రోజు కార్యక్రమాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ , సినీ ప్రముఖుల సందడితో అత్యంత ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవాస తెలంగాణవాసుల సౌకర్యార్థం హైదరాబాద్లో సుమారు రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త ‘ఎన్ఆర్ఐ భవన్’ను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఎన్ఆర్ఐలు ప్రతి వారం కనీసం రెండు రోజులను తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కేటాయించాలని ఆయన కోరారు. దీనివల్ల రాష్ట్రంలో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న స్థానిక కళాకారులకు చేతినిండా పని దొరుకుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఇదే వేదికపై తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఆటా వేడుకల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విదేశాలలో ఎన్నారై కాంగ్రెస్ బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రత్యేక పురస్కారాలు..
ఈ వేడుకల్లో భాగంగా ఆటా పూర్వ అధ్యక్షులతో పాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఇతర తెలుగు సంఘాల నాయకులను నిర్వాహకులు వేదికపై ఘనంగా సత్కరించారు. భారత , అమెరికా సైన్యంలో విశేష సేవలు అందించిన తెలుగు వీరులను గుర్తించి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను కొనియాడుతూ ప్రత్యేకంగా పురస్కారాలు అందజేసి గౌరవించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ నేతృత్వంలో నిర్వహించిన ఫ్యాషన్ షో సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.
పట్టుపురుగులకు ఎలాంటి హాని చేయకుండా, వాటిని చంపకుండా సేకరించే “అహింసా సిల్క్” వస్త్రాలతో తెలంగాణ చేనేత కార్మికులు తయారుచేసిన సరికొత్త వస్త్రాలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా గత దశాబ్ద కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేస్తున్న అర్చనా కొచ్చర్.. ఈ వేదిక ద్వారా తెలంగాణ చేనేత రంగం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పారు.
ఆకట్టుకున్న శివారెడ్డి ప్రదర్శన..
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన మాటల గారడీతో సభను నవ్వుల్లో ముంచెత్తారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, చలనచిత్ర రంగానికి చెందిన నటీనటులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నాయిక పూజా హెగ్డే , యువ హీరో అడివి శేష్ వేదికపైకి వచ్చి ఆటా సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మహాసభల రెండో రోజు ఉదయం పూట తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అసలైన ప్రతీకైన బోనాలు, పోతురాజుల ఘనమైన విన్యాసాలు, జానపద జీవన వైవిధ్యాన్ని ప్రతిబింబించే మత్స్యకారుల నృత్య ప్రదర్శనలతో ప్రారంభోత్సవ వేడుకలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా స్వయంగా శివలింగాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ వేడుకల్లో ప్రముఖ గేయ రచయిత జోన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేకంగా రచించిన అద్భుతమైన గేయానికి రూపొందించిన నృత్య రూపకం ఈ సభకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దాదాపు 7 వేర్వేరు డాన్స్ స్కూళ్ల నుండి విచ్చేసిన 180 మంది ప్రతిభావంతులైన నాట్య కళాకారులు ఏకధాటిగా ప్రదర్శించిన ఈ అద్భుత దృశ్యకావ్యం సభలోని ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈ విశిష్టమైన ప్రదర్శనను విజయవంతం చేయడానికి కళాకారులు గత నాలుగు నెలలుగా కఠోరంగా సాధన చేయడం విశేషం.
సేవా కార్యక్రమాలపై ప్రశంసలు…
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ఆటా కమిటీకి, సభ్యులందరికీ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. సమాజానికి, ముఖ్యంగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ఆటా సంస్థ అందిస్తున్న విభిన్న సేవా కార్యక్రమాలను ఆయన ఎంతగానో కొనియాడారు. ఇదే సమయంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న పలువురు ఉదార స్వభావులైన దాతలను నిర్వాహకులు వేదికపై ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఉత్సవ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల వ్యాపార స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీనివాస్ సజ్జా , మురళి గింజుపల్లిల మార్గదర్శకత్వంలో సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. అమెరికాలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే యువ విద్యార్థులకు అక్కడ అందుబాటులో ఉన్న అవకాశాలు, కోర్సులు , ఇతర మార్గాల గురించి సందర్శకులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. మరోవైపు, సమాజానికి ఆటా అందిస్తున్న నిరంతర సేవలను , తెలుగు సంస్కృతి పరిరక్షణకు సంస్థ చేస్తున్న వారిని ప్రత్యేకంగా గుర్తిస్తూ మేరీల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసి ఆటాను అభినందించింది.








