టెక్సాస్‌లో అట్టహాసంగా ‘టాంటెక్స్’ 228వ సాహిత్య సదస్సు.. ఘనంగా ప్రఖ్యాత సాహిత్యవేత్తల ప్రసంగాలు!
మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ‘న భూతో న భవిష్యత్’ అన్నట్లుగా ‘నెలనెల తెలుగువెన్నెల’ వేదికగా 228వ సాహిత్య సదస్సు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. 2026 జూలై 26వ తేదీ ఆదివారం రోజున టెక్సాస్‌లోని లూయీస్ విల్ నగరంలో గల ప్రత్యేక సమావేశ మందిరము వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘తెలుగు సాహిత్య విమర్శ – నాడు-నేడు’ అనే అంశంపై ముఖ్య అతిథి శ్రీ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి చేసిన ప్రసంగం , మరో ముఖ్య అతిథి డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి అందించిన ‘హరికథా పితామహ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు’ అనే అంశంపై ప్రసంగాలు సాహితీ ప్రియులను విశేషంగా అలరించాయి.
కార్యక్రమ ప్రారంభంలో డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి “గజాననమ్ భూత గణాధి సేవితం…” అంటూ ప్రార్థన గీతాన్ని రాగయుక్తంగాను, వీనుల విందుగాను ఆలపించడంతో సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ సమాజము, సాహిత్యము, సాహిత్య విమర్శ ఈ మూడింటి మధ్య విడదీయరాని బంధమున్నదని పేర్కొన్నారు. కథలలో నాటకీయత కన్నా సజీవ చిత్రణ గొప్పగా కనబడాలన్నది తన అభిప్రాయమని తెలిపారు.
నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కళ్ళముందు కదలాడే విధంగా రచనలు ఉండాలని, సాహిత్యాన్ని కేవలం సౌందర్య ఆస్వాదనగా కాక, సామాజిక మార్పునకు, ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే సాధనంగా భావించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాచీన ప్రబంధాల నుండి ఆధునిక వచన కవితలు, నవలలు, కథానికల వరకు ప్రతి అంశాన్ని శాస్త్రీయమైన దృష్టితో పునర్మూల్యాంకనం చేసినట్లు తెలిపారు. రాయలసీమ సాహిత్యోద్యమాలు, కరువు, ఫ్యాక్షనిజం, వర్తమాన రాజకీయాలు వంటి నిర్దిష్ట సమస్యలతో కూడిన సీమ చరిత్రను, అక్కడి బతుకుచిత్రాన్ని తన విమర్శలో ప్రత్యేకంగా వెలుగులోకి తెచ్చిన వైనాన్ని ఆయన కూలంకషంగా చర్చించారు.
సాహిత్య విమర్శకు తొలి ఆనవాళ్లు 1829 నుండి 1950 వరకు ఒక దశకు చేరుకున్నట్లు తెలియజేసిన చంద్రశేఖర రెడ్డి, తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను వివిధ దశలుగా, వివిధ రీతులలో ఎలా పరిణామం చెందిందో సంక్షిప్తంగా అయినప్పటికీ మనసుకు హత్తుకునేలా సమన్వయపరిచారు. ఏ ప్రక్రియ కైనా ఎదుగుదలకు కొలమానం లేదని ఉటంకిస్తూ, తెలుగు సాహిత్య విమర్శలో జరిగిన కొన్ని అద్భుతాలుగా గురజాడ అప్పారావు గారి ఐదు కథలకు ఐదు వందల పుటల విమర్శలు, కన్యాశుల్కంపై ఐదు వేల పుటల విమర్శలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పుడూ విమర్శకులు ఉండాల్సిందేనని కవి తిక్కన అన్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కట్టమంచి రామలింగారెడ్డి, కొడవగంటి కుటుంబరావు, కందుకూరి వీరేశలింగం, దువ్వూరి రామిరెడ్డి, కోరాడ రామకృష్ణయ్య, కురుగంటి సీతారామయ్య, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి ప్రముఖ సాహిత్య విమర్శకులను స్పృశించిన చంద్రశేఖర రెడ్డి.. ఆలంకారిక విమర్శ, కవిజీవిత సమన్వయ విమర్శ, తులనాత్మక విమర్శ, మార్క్సిస్టు విమర్శ, చారిత్రక విమర్శ మొదలైన పద్ధతుల్లో సాహిత్య విమర్శకు కృషి చేసిన విమర్శకుల దృక్పథాలను చక్కగా విశ్లేషించారు. ప్రాంతీయ అస్తిత్వ వాదన మొదలుకొని ఆధునిక సాహిత్యంలో వచ్చిన స్త్రీవాద, దళితవాద సాహిత్యాన్ని, ఆ విమర్శ తీరుతెన్నులను సమగ్రంగా తెలియజేశారు.
సాహిత్య విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలను సమన్వయిస్తూ, సమకాలీన సాహిత్యంలో వెలువడుతున్న విమర్శల భావజాలాన్ని ఎలా అధ్యయనం చేయాలో సూచించారు. సాహిత్య విమర్శ అనేది నిరంతర ప్రక్రియ అనీ, సాహిత్య విమర్శ ఎవరు ఎప్పుడు చేసినా సదరు విమర్శ కూడా విమర్శకు లోనుకావలసిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో ముఖ్య అతిథి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి మాట్లాడుతూ, హరికథా గానంతో విజయనగర ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేసిన కీర్తిశేషులు ఆదిభట్ల నారాయణ దాసు చిరస్మరణీయులని పేర్కొన్నారు. అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు రక్తాక్షి నామ సంవత్సరము 1864 ఆగష్టు 31న అజ్జాడ అను గ్రామమందున (ప్రస్తుతం విజయనగరం జిల్లా) ఆదిభట్ట కులమందు భరద్వాజస గోత్రమున వేంకటచయన, లక్ష్మీనరసమాంబలకు జన్మించిన పుణ్యమూర్తి అని తెలిపారు.
కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి తయారుచేసుకున్న ‘హరికథ’ కళను నారాయణదాసు అత్యున్నత శిఖరాలకు తీసుకొనిపోయారనీ వివరించారు. ఋగ్వేదాన్ని స్వరసహితంగా అచ్చతెనుగులోనికి అనువదించి, వేదంలోని విజ్ఞానాన్నీ, మంత్రమహిమను తెలుగువారికి తెలిపిన నారాయణదాసు.. ఆంగ్లంలో షేక్స్పియర్ నాటక రంగములోని ఘట్టములను హృద్యముగా మన భాషలోకి అనువదించారని తెలిపారు. మనదేశంలో హరికథారచనకు, ప్రచారానికి మార్గదర్శకులుగా నిలిచారని, పంచముఖి, షణ్ముఖి వంటి అసాధ్యములైన తాళములలో రచనలు చేసి గానం చేసిన నారాయణ దాసు ‘ఆట పాట మాట మీటల మేటి’ గా ప్రసిద్ధినొందారని తెలిపారు.
జానకీశపథము, రుక్మిణీకళ్యాణము, గజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర, ధ్రువోపాఖ్యానము, మార్కండేయోపాఖ్యానము, భీష్మచరిత్రము, సావిత్రీచరిత్రము, యదార్థ రామాయణము మున్నగునవి హరికథలను; శ్రీరామచంద్రశతకము, కాశీశతకము వంటి శతకములను; ఉమర్ ఖయామ్, బాటసారి వంటి కావ్యములను; జగజ్జ్యోతియను వేదాంత గ్రంథమును, తారకమను శృంగార ప్రబంధమును, ‘నవరసతరంగిణి’ అను సంగీతశాస్త్ర గ్రంథమును, హనుమత్సందేశమును రచించిన నారాయణ దాసు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
ప్రముఖ గాయకులు డాక్టర్ మంగళంపల్లి మురళీకృష్ణ తన ఎనిమిదవ ఏటనే నారాయణ దాసు వద్ద ఆశీస్సులు పొందినట్లు తెలియజేశారు. ‘హరికథా’ ప్రక్రియ ద్వారా ఆనందం కల్పిస్తూ పురుషార్థ సాధనకు అవసరమైన విజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రముల నాలుగు చెరగులా పండిత పామరులందరికీ సుమారు ఆరు దశాబ్దాలకు పైగా పంచిపెట్టి సహస్ర చంద్ర దర్శనముచే చరితార్థుడై సిద్ధినొందిన నారాయణదాసు మనకు చిరస్మరణీయుడు , సదా స్మరణీయుడు అని పేర్కొన్నారు.
డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి తన మధుర కంఠంతో పద్యాలు, కీర్తనలు ఆలాపన చేసినప్పుడు అందులో లయబద్ధమైన సంగీతం, సాహిత్య స్పష్టత , భక్తి భావాల సమ్మేళనం కనిపించింది. నిజం చెప్పాలంటే వారు తమ అద్భుతమైన గాన మాధుర్యంతోను, వాక్చాతుర్యంతోను వీక్షకులను ఎంతగానో రంజింపచేశారు.
నేటి సాహితీ సదస్సును ఆద్యంతం తిలకించిన డాక్టర్ తోటకూర ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస రెడ్డి సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సతీష్ బండారు, జయదేవ్ మెట్టుపల్లి, వెంకట్ కొత్తూరు, మద్దుకూరి చంద్రహాస్, సురేష్, అనంత్ మల్లవరపు, కమలాకర్ దేవరకొండ, రాజారెడ్డి, లెనిన్ వేముల, ఆర్.జె. శ్రీనివాసులు, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, గోవర్ధన రావు నిడిగంటి, ఆచార్య అయ్యల సోమయాజులు, నవీన్ గోదావర్తి, విజయ లక్ష్మి కందిబండ మొదలైన సాహితీ ప్రియులు నేటి ముఖ్య అతిథులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారిని , డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిని అభినందిస్తూ తమ తమ స్పందనలను తెలియజేశారు.
అనంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రస్తుత అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి తరపున సంస్థ ఉత్తరాధ్యక్షులు ఉదయ్ కిరణ్ నిడిగంటి, సంస్థ సమన్వయకర్త దయాకర్ మాడ, డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ శ్రీనివాసరెడ్డి వంటి అనేకమంది సాహితీ ప్రియుల సమక్షంలో నేటి ముఖ్య అతిథులకు టాంటెక్స్ సంస్థ సమర్పించిన సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి పుష్పగుచ్చాలతోను, దుశ్శాలువాలతోను ఘనంగా సన్మానించడం జరిగింది.
డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, అనంత్ మల్లవరపు, సతీష్ బండారు, చిన్న సత్యం వీర్నాపు వంటి సంస్థ పూర్వ అధ్యక్షులతో పాటు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, చంద్రహాస్ మద్దుకూరి, రాజా రెడ్డి, శ్రీనివాస్ రాజు, లెనిన్ బండ, లెనిన్ వేముల, కిరణ్మయి గుంట, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, శ్రీమతి విజయ లక్ష్మి కందిబండ, గోవర్ధనరావు నిడిగంటి, గుత్తా హరి.ఎస్. నాయుడు, రమణి, లలిత, పవన్, కె.ఎ. మూర్తి, కె.వి. ఫణి రాజకుమార్, ప్రకాష్ తిమ్మనాపురం వంటి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో సదస్సు అత్యంత విజయవంతమైంది.
వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్థికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, సంస్థ ఉత్తరాధ్యక్షులు ఉదయ్ కిరణ్ నిడిగంటి, సమన్వయకర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి , అధికార కార్యవర్గ బృంద సభ్యులు అందరూ అభినందనీయులు.








