విశ్వం మొత్తం ఒకే భాష మాట్లాడుతోంది… అది ఏంటో?
— శివ దువ్వూరు
ఒక అత్యాధునిక స్పేస్‌షిప్… అది భూమిని దాటి… చంద్రుడిని దాటి…సౌర కుటుంబాన్ని దాటి… గెలాక్సీలను దాటుకుంటూ… విశ్వం చివరి అంచుల వరకు ప్రయాణిస్తోంది. ఆ స్పేస్షిప్లోని సూపర్ కంప్యూటర్ ఎదురయ్యే ప్రతి గ్రహాన్ని స్కాన్ చేస్తోంది. ప్రతి నక్షత్రాన్ని విశ్లేషిస్తోంది. కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి వచ్చే ప్రతి కాంతి కిరణాన్ని చదువుతోంది. అందరూ ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ కంప్యూటర్ స్క్రీన్‌పై పదేపదే ఒకే సందేశం మెరుస్తోంది. Language Detected… Same. మరో గెలాక్సీ… Same. మరో నక్షత్రం… Same. విశ్వం చివరి అంచు…Same. కంట్రోల్ రూమ్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. “ఇది ఎలా సాధ్యం?” అందరిలో సందేహం. ఎందుకంటే భూమి మీద వేల భాషలు ఉన్నాయి. దేశం మారితే భాష మారుతుంది. మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అనువాదం అవసరం. కానీ…ఈ విశ్వం మొత్తం ఒకే భాష మాట్లాడుతోంది. ఆ భాష మరేదో కాదు… ప్రకృతి నియమాలు.
భూమి మీద చెట్టు నుంచి పండు కింద పడుతుంది. అదే గురుత్వాకర్షణ కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను కూడా నడిపిస్తోంది. భూమి మీద హైడ్రోజన్ ఎలా ప్రవర్తిస్తుందో…దూర నక్షత్రాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తోంది. కాంతి ఇక్కడ ఎంత వేగంతో ప్రయాణిస్తుందో… విశ్వం చివరలో కూడా అదే వేగంతో ప్రయాణిస్తోంది. శాస్త్రవేత్తలు ఎంత దూరం చూసినా ప్రకృతి తన భాషను మార్చిన ఆనవాలు ఇప్పటివరకు కనిపించలేదు. అందుకే భూమి మీద కూర్చుని రాసిన సమీకరణాలు… మనిషి ఎప్పటికీ వెళ్లలేని నక్షత్రాల గురించీ నిజాలు చెబుతున్నాయి. అంటే…ప్రకృతి ఒకే భాష మాట్లాడటం వల్లే మనం విశ్వాన్ని చదవగలుగుతున్నాం. కానీ… అసలు ఆశ్చర్యం ఇంకా ఉంది ప్రకృతి ఒకే భాష మాట్లాడటం ఒక ఎత్తయితే… ఆ భాషలోని “లెక్కలు” మరో ఎత్తు. ఒక్కసారి ఊహించండి. గురుత్వాకర్షణ ఇప్పుడున్న దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటే? మీ శరీర బరువు పెరిగిపోతుంది. నడవడం కష్టమవుతుంది. చెట్లు ఇవాళ ఉన్నంత ఎత్తు పెరగకపోవచ్చు. పక్షులు ఎగరడానికి మరింత శక్తి ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇది భూమి వరకే కాదు. అదే గురుత్వాకర్షణ నక్షత్రాల జీవితాన్నీ మార్చేస్తుంది. వాటి చుట్టూ గ్రహాలు ఏర్పడే విధానం కూడా మారిపోతుంది. కొంచెం తక్కువగా ఉంటే? పదార్థం ఒకచోట చేరి నక్షత్రాలు ఏర్పడటమే కష్టమయ్యేది.
అలాగే…అణువులను కలిపే ప్రకృతి బలాల్లో చిన్న మార్పు వచ్చినా…నీరు ఏర్పడకపోవచ్చు. కార్బన్ పుట్టకపోవచ్చు. మనకు తెలిసిన జీవం అసలు ఉనికిలోకి వచ్చేదే కాదు. అంటే… జీవం పుట్టడానికి అవసరమైన పరిస్థితులు ఆశ్చర్యకరంగా సరిపోయాయి. ఆ తర్వాత జరిగినది మరింత అద్భుతం కోట్ల సంవత్సరాల పాటు విశ్వం నిశ్శబ్దంగా తన కథను తాను రాసుకుంది. ఆ కథను అర్థం చేసుకునే జీవి పుట్టడానికి మాత్రం కోట్ల సంవత్సరాలు పట్టింది. చివరికి…ఒక సాధారణ నక్షత్రం చుట్టూ తిరిగే చిన్న గ్రహంపై జీవం పుట్టింది. ఆ జీవం క్రమంగా ఎదిగింది. ఆలోచించడం నేర్చుకుంది. భాష నేర్చుకుంది. ఆకాశం వైపు చూసి ఒక ప్రశ్న అడిగింది. “నేను ఎక్కడి నుంచి వచ్చాను?” అదే మనిషి. మరో ఆశ్చర్యపరిచే విషయం మన శరీరంలోని కార్బన్… ఇనుము… కాల్షియం…ఇవన్ని కూడా నక్షత్రాల్లో ఉన్నాయంటే నమ్ముతారా. అంటే… నక్షత్రాల్లో పుట్టిన అణువులతోనే ఇప్పుడు నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నాం.
ఇంతకీ ఈ భాషను ఎవరు రాశారు? శాస్త్రం అందించిన తోర్పాటుతో ప్రకృతి మాట్లాడే భాషను మనం చాలావరకు చదివేశాం. ఆ భాషతో విమానాలు తయారు చేశాం. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాం. చంద్రుడిపై అడుగుపెట్టాం. దూర గెలాక్సీలను చూస్తున్నాం. అయినా… ఆ భాషను ఎవరు రాశారు? ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా విశ్వంలోనే దాగి ఉంది. బహుశా… అదే ఈ విశ్వంలో ఉన్న అతి పెద్ద రహస్యం. అందుకే…ఈ రోజుకి కూడా మనం ఆకాశం వైపు చూస్తాం. నక్షత్రాలను చూడటానికి కాదు…ప్రకృతి మాట్లాడుతున్న ఆ రహస్య భాషను మరింత అర్థం చేసుకోవడానికి. ఆ భాష పూర్తిగా అర్థమయ్యే రోజు… ఈ విశ్వం గురించి కూడా మనకు పూర్తిగా అర్థం అవుతుంది. అప్పటి వరకు ఆశ్చర్యమే మనకు తోడుగా ఉంటుంది.








