భూమిపై మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే… కారణం ?
—శివ దువ్వూరు
ఉదయం సరిగ్గా 5:42 అయ్యింది.
రోజులాగే వీచాల్సిన చల్లని గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆకుల కదలిక లేదు, ఏ సవ్వడీ లేదు.
కొద్ది నిమిషాల్లోనే సముద్రం కూడా తన శ్వాసను ఆపేసినట్టు నిశ్చలంగా మారిపోయింది. ఒడ్డును తాకే అలల చప్పుడు పూర్తిగా మూగబోయింది. ఆకాశం నెమ్మదిగా తన నీలి రంగును కోల్పోతూ వస్తోంది.
సూర్యుడైతే ఉదయించాడు. కానీ అందులో వెలుగు తప్ప, ప్రతిరోజూ ఉండే ఆ వెచ్చదనం లేదు.
పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడం మానేసి, ఏదో తెలియని భయంతో దూరంగా పారిపోతున్నాయి. గాలి శ్వాస బిగపట్టినట్టుంది. మనుషులు ఆందోళనగా ఆకాశం వైపు చూస్తున్నారు… ప్రకృతి మనకు ఏదో సంకేతం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు!
…
అదృష్టవశాత్తూ, ఇదొక ఊహ మాత్రమే. మన భూమి మీద ఇప్పటివరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.
ఎందుకంటే, మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా… మనకు తెలియకుండానే కోట్లాది సహజ వ్యవస్థలు ప్రతి క్షణం ఈ ప్రపంచాన్ని ఒక లయ ప్రకారం నడిపిస్తున్నాయి. అందుకే ప్రతి ఉదయం మనకు మరో సాధారణ రోజులాగే ప్రారంభమవుతుంది.
భూమి… ఒక అద్భుతం
విశ్వంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఖగోళ శాస్త్రవేత్తలు వేలాది కొత్త గ్రహాలను కనుగొన్నారు. కొన్ని గ్రహాలు నిప్పుల కొలిమిలా ఉన్నాయి. మరికొన్ని మంచుతో గడ్డకట్టిపోయాయి. కొన్నింటిపై వాతావరణమే లేదు. మరికొన్నింటిపై నీటి జాడ కనిపించదు. జీవం వికసించడానికి అనువైన ప్రపంచం మాత్రం ఇప్పటివరకు అత్యంత అరుదైనదిగా కనిపిస్తోంది. అందుకే శాస్త్రవేత్తలు భూమిని చూస్తే ఒక ప్రశ్న అడుగుతారు.
“ఇది ఇంతకాలం ఎలా నిలబడగలిగింది?”
ఖగోళ శాస్త్రవేత్తల కళ్లతో చూస్తే—ఈ ‘సాధారణం’ వెనుక ఒక అసాధారణమైన, అద్భుతమైన విస్మయం దాగి ఉంది. ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి సెకనూ… ఈ విశ్వంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా పనిచేస్తున్న ఆ నిశ్శబ్ద శక్తులు ఏమిటి?
సూర్యుడి నుంచి ఆ ‘సరిగ్గా సరిపోయే’ దూరం
ఒక చలికాలపు రాత్రి వేళ మంట కాచుకుంటున్న క్షణాన్ని గుర్తుతెచ్చుకోండి. మరీ దగ్గరగా కూర్చుంటే వేడి తట్టుకోలేం, దూరంగా జరిగితే చలి చంపేస్తుంది. ప్రాణానికి హాయిగా అనిపించేది ఒక నిర్దిష్టమైన దూరంలోనే.
మన భూమి సరిగ్గా అలాంటి ప్రదేశంలోనే ఉంది. శాస్త్రవేత్తలు దీనిని ‘హాబిటబుల్ జోన్’ (Habitable Zone) అని పిలుస్తారు. సూర్యుడి నుంచి భూమి ఉన్న ఈ కచ్చితమైన దూరం వల్లనే, ఇక్కడ నీరు ఆవిరైపోకుండా లేదా మంచులా గడ్డకట్టుకుపోకుండా ప్రవహించే ద్రవరూపంలో ఉంది.
కొద్దిగా దగ్గరగా ఉంటే శుక్ర గ్రహం (Venus) లాగా మన సముద్రాలన్నీ ఉడికిపోయి ఆవిరయ్యేవి. కొద్దిగా దూరంగా జరిగితే అంగారకుడి (Mars) లాగా సర్వస్వం మంచు ఎడారిలా మారిపోయేది.
సూర్యుడి నుంచి భూమి ఉన్న ఈ సరిగ్గా సరిపోయే దూరం గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. కానీ అదే దూరం ప్రతిరోజూ మన ఉనికిని కాపాడుతోంది.మన పొలాల్లో పండే పంట…మనం పీల్చే గాలి…ఇవన్నీ ఈ చిన్న దూరం మీదే ఆధారపడి ఉన్నాయి.
పాదాల కింద నిశ్శబ్దంగా పనిచేస్తున్న రక్షణ కవచం
సూర్యుడి నుంచి మనకు వచ్చేది కేవలం ప్రాణాన్నిచ్చే వెలుగు మాత్రమే కాదు… దానితో పాటు ప్రాణాంతకమైన ‘సౌర గాలులు’ (Solar Winds), రేడియేషన్ నిరంతరం భూమి వైపు దూసుకొస్తుంటాయి. మరి అవి మనల్ని ఎందుకు తాకడం లేదు?
మన అడుగుల కింద, దాదాపు 1,800 మైళ్ల లోతులో… ద్రవరూపంలో ఉన్న ఇనుము భూమి కేంద్రకం చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంటుంది. ఈ కదలిక వల్ల భూమి చుట్టూ అంతరిక్షంలోకి విస్తరించే ఒక అయస్కాంత క్షేత్రం (Magnetic Field) ఏర్పడుతుంది.
ఇది ఒక కంటికి కనిపించని అదృశ్య రక్షణ కవచంలా నిలబడి, సూర్యుడి నుంచి వచ్చే విషపూరిత వికిరణాన్ని పక్కకు తోసివేస్తుంది. ఒకవేళ ఈ కవచమే లేకపోతే, మన వాతావరణం ఎప్పుడో అంతరిక్షంలో కలిసిపోయేది.
మనం నిద్రపోతున్నప్పుడు కూడా…ఆ కవచం మెలకువగా ఉంటుంది. మన పిల్లలు స్కూల్కు వెళ్తున్నప్పుడు కూడా… అది తన పని చేస్తూనే ఉంటుంది. మనకు అది కనిపించదు. అందుకే దాని విలువ మనకు తెలియదు.
రాత్రి వేళ కాపలా కాసే నిశ్శబ్ద మిత్రుడు
ఆకాశంలో వెన్నెల కురిపించే చంద్రుడు కేవలం ఒక అందమైన దృశ్యం మాత్రమే అనుకుంటే పొరపాటే. చంద్రుడికి ఉన్న గురుత్వాకర్షణ శక్తే భూమి తన అక్షం (Axis) మీద ఎక్కువ ఊగిసలాడకుండా స్థిరంగా నిలబెడుతోంది. చంద్రుడే గనక లేకపోతే భూమి వంపు తరచూ మారిపోతూ, ఒకే రోజులో ఊహించని తుఫానులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో భూమి గందరగోళంగా మారేది.
మన జీవితంలో ఋతువులు క్రమం తప్పకుండా వస్తున్నాయన్నా, కాలాలు మారుతున్నాయన్నా… దానికి కారణం ఆ ఆకాశంలో ఉన్న నిశ్శబ్ద సహచరుడే. మనకు చంద్రుడు ఒక అందమైన వెన్నెల. కానీ భూమికి మాత్రం అతను ఒక నమ్మకమైన సహచరుడు.
విస్మయం కలిగించే సమతుల్యత
భూమిపై మనం బ్రతకటానికి ఓ ఒక్క ప్రత్యేకతో కారణం కాదు..బోలుడన్ని . వాటిలో ముఖ్యంగా… సూర్యుడి నుంచి సరైన దూరం. గాలిని పట్టి ఉంచగల భూమి పరిమాణం, నిరంతరం పనిచేసే అయస్కాంత క్షేత్రం, స్థిరత్వాన్ని ఇచ్చే చంద్రుడు, సమృద్ధిగా ఉన్న నీరు. ఇవన్నీ నాలుగు వందల కోట్ల సంవత్సరాలుగా ఒక అద్భుతమైన లయలో, ఒకదానికొకటి తోడుగా పనిచేస్తున్నాయి. ఈ సమతుల్యతే జీవం పుట్టడానికీ, అది నిలబడడానికీ కారణమైంది.
అసలు భూమిని కాపాడుతోంది ఎవరు?
ఈ ప్రశ్నకు సైన్స్ ఇచ్చే సమాధానాలు క్యాజువల్ గానే ఉంటాయి: గురుత్వాకర్షణ, ప్రకృతి నియమాలు, ఖగోళ భౌతిక శాస్త్రం, నీటి చక్రం… ఇలా ఎన్నో. కానీ, ఈ వ్యవస్థలన్నీ కలిసి బిలియన్ల సంవత్సరాలుగా ఒక్క సెకను కూడా తేడా కూడా రాకుండా ఈ సమతుల్యతను ఎలా కాపాడుతున్నాయో లోతుగా ఆలోచిస్తున్న కొద్దీ… మన మనస్సు ఆశ్చర్యంతో నిండిపోతుంది.
అసలు అద్భుతం ఇదే
ప్రతి ఉదయం… సూర్యుడు ఉదయిస్తాడు. గాలి వీచుతుంది. సముద్రం అలలు పంపిస్తుంది. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి. పక్షులు ఎగురుతాయి. మనం వాటిని చూసి ముందుకు వెళ్లిపోతాం. ఎందుకంటే…అవి ప్రతిరోజూ జరుగుతాయి. మనకు ప్రతి ఉదయం ఒక సాధారణ రోజు. భూమికి మాత్రం… అది మరోసారి విజయవంతంగా కాపాడిన జీవితం.
అందుకే…
ఈ రోజు సాయంత్రం ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. మీకు కనిపించేది కేవలం సూర్యాస్తమయం కాదు. కోట్లాది సంవత్సరాలుగా ఒక్క క్షణం కూడా తప్పు చేయకుండా పనిచేస్తున్న ఒక అద్భుతమైన ప్రపంచం.








